అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భారత్-చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో పాల్గొన్న కూలీలు వరదలో గల్లంతయ్యారు. కురుంగ్ కుమి జిల్లాలో 19మంది మంది కార్మికులు 14 రోజుల క్రితం తప్పిపోయారు. మిస్సైన వారిలో ఒకరి మృతదేహం ఫురాక్ నదిలో లభ్యమైంది. దీంతో మిగిలిన కూలీలు కూడా నదిలో మునిగి చనిపోయి ఉంటారని స్థానికులు చెపుతున్నారు. అయితే ఇది అనుమానం మాత్రమేనని.. ఖచ్చితంగా తెలియదని అధికారులు చెపుతున్నారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ ని పంపి.. మిగిలిన కూలీల ఆచూకీ కోసం కృషి చేస్తామని అధికారులు చెప్పారు. కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టార్ నిరాకరించడంతో.. సుమారు 19మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్ళడానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం.. అసోం కు చెందిన కొందరు కార్మికులను రోడ్డు నిర్మాణం కోసం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) అరుణాచల్‌కు తీసుకువచ్చారు. చైనా సరిహద్దు సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈద్ సందర్భంగా అసోం లోని తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారు. కార్మికులు ఇంటికి వెళ్లేందుకు కాంట్రాక్టర్ ను సెలవు అడిగారు. అయితే.. కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో.. కాంట్రాక్టర్ కు చెప్పకుండా కాలినడకన అస్సాంకు బయలుదేరారు. అరుణాచల్‌లోని కురుంగ్ కుమే జిల్లా అడవులలోకూలీలు అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నదిలో మృతదేహం లభ్యం కావడంతో కూలీలంతా నదిలో మునిగి చనిపోయి ఉండవచ్చు అంటూ అనుమానిస్తున్నారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పెద్ద నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతమైన డామిన్ సర్కిల్‌లో రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలను నియమించారు. నిర్మాణ స్థలం చైనా సరిహద్దుకు సమీపంలోని డామిన్‌లో ఉంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా, ఇప్పటికే నదుల నీటిమట్టం పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో.. ఎవరైనా నదిలో మునిగిపోతే.. బాధితులను రక్షించడం పెద్ద సవాల్ అని అధికారులు చెబుతున్నారు.