అది ఒక పాడుబడిన బంగ్లా .. అటుగా వెళ్లే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే ఒక ప్రేతాత్మ ఆ బంగ్లాలో ఉంటోంది. అటు వైపు వెళ్లిన వారిని అది చంపేస్తుంది. అందువలన కొన్నేళ్లుగా అది పాడుబడిపోయింది. అలాంటి బంగ్లాలోకి ధైర్యం చేసి కొంతమంది అబ్బాయిలు .. అమ్మయిలు వెళతారు. ఇక లోపల ఏం జరుగుతుందనే కథనే చాలా హారర్ థ్రిల్లర్ సినిమాలకి కథా వస్తువుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దెయ్యాల నేపథ్యంలో ఉండే కొత్త పాయింట్ ఏదైతే ఉంటుందో అదే ఆ సినిమా రెస్పాన్స్ ను నిర్ణయిస్తుంది.
అలా హారర్ థ్రిల్లర్ జోనర్లో నిన్న విడుదలైన సినిమానే ‘అశ్విన్స్’. సాధారణంగా భయపెట్టడానికి ప్రేతాత్మ .. భయపడటానికి కొంతమంది మనుషులు ఉంటే సరిపోతుంది. కానీ ఈ ఇద్దరి మధ్యకి ఈ సినిమా దర్శకుడు తరుణ్ తేజ అశ్వనీ దేవతలను లాగాడు. ఆయన చేసిన ఈ పని వల్లనే ఆడియన్స్ కి కొంత అసహనం కలుగుతుంది. ఎందుకంటే ఆ ట్రాక్ లో లాజిక్ లేదు .. ఒకవేళ ఉందని దర్శకుడు అనుకుంటే, అది సామాన్యులకు అర్థం కాదు. ఈ ట్రాక్ వల్లనే క్లైమాక్స్ లో కాస్త అయోమయం కలుగుతుంది.
సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలను కాపాడేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. సినిమాటోగ్రఫీ. ఈ సినిమాను కూడా అవే కాపాడాయి. దర్శకుడు రాసుకున్న కథ .. స్క్రీన్ ప్లే కంటే కూడా టెక్నీకల్ టీమ్ ఆడియన్స్ ను ఎక్కువగా భయపెడుతుంది. అలాగని డైరెక్టర్ ని తక్కువ చేయడానికి లేదు .. ఆయనలో మంచి విషయం ఉంది. ఈ సినిమాకి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. అందువలన నిర్మాణ పరమైన విషయాలను గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇంతమంచి టెక్నికల్ టీమ్ ను పెట్టుకుని, మరో మంచి కథను సెట్ చేసుకుని ఉంటే బాగుండేదే అనిపిస్తుంది.