Govt. sponsored: ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ అమలాపురం అల్లర్లు సృష్టించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, అమలాపురం అల్లర్లు ప్రభుత్వం స్పాన్సర్ చేసిందేదని తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమలో జరిగిన ఘటనలో ఉన్నది వైసీపీ వాళ్లేనని, విధ్వంసం వెనుక ప్రధాన సూత్రదారి అన్నెం సాయి వైసీపీ కార్యకర్త కాదా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, అదనపు పోలీసు బలగాలను రప్పించాలేదని, అధికారులను కూడా అక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు పంపలేదని అచ్చెన్న విమర్శించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు.
విధ్వంసకారులు వస్తారని ముందే తెలుసని, అందుకే మంత్రి, ఎమ్మెల్యేను అక్కడి నుంచి ముందుగా తప్పించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. తునిలో ట్రైన్‍ను తగులబెట్టింది వైసీపీ నాయకత్వం కాదా? కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు?. వైఎస్సార్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ వారి షాపులను తగలబెట్టింది ఎవరు ? అంటూ విరుచుకుపడ్డారు
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని, అమలాపురంలో 144 సెక్షన్ ఉంటే అంతమంది ఎలా వచ్చారన్నారు అచ్చేన్న్నాయుడు. ప్రభుత్వం చిక్కులో పడ్డ ప్రతిసారీ ఏదో వివాదాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం జగన్‍కు అలవాటైందని దుయ్యబట్టారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుతో వైసీపీకి చెడ్డపేరు వచ్చిందని, జగన్‍ను అందరూ తిడుతున్నారని, పన్నులు, ధరలు పెంపుపై ప్రజలు భగ్గుమంటున్నారని అందుకే ఈ చిచ్చు రేపారని అన్నారు. వైసీపీని ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చిందిని, జిల్లాల విభజనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని….. జిల్లాల ఏర్పాటు సమయంలో అఖిలపక్షాన్ని సంప్రదించలేదని, మీరే సమస్యలు సృస్టించి ఇతర పార్టీలపై నెడతారా? అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read : విధ్వంసం వెనుక బాబు, పవన్…దాడిశెట్టి ఆరోపణ