స్పీకర్ తమ్మినేని సీతారాంపై తాను చేసిన వ్యాఖ్యలు పట్ల ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు, ఈ విషయాన్ని పొడిగించే ఉద్దేశ్యం కూడా తనకు లేదని కమిటీ ఎదుట చెప్పారని కాకాణి వెల్లడించారు. అచ్చెన్నాయుడు వివరణను కమిటీ సభ్యులందరికీ రాత పూర్వకంగా పంపుతామని, వారి అభిప్రాయాలు వచ్చిన తరువాత ఈ విషయంలో ఏమి చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రివిలేజ్ కమిటి సమావేశం నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగింది. అనంతరం కాకాణి మీడియాతో మట్లాడుతూ కూన రవికుమార్ అందుబాటులో లేనంటూ సమాచారం పంపారని, తనకు కమిటీ ముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు నుంచి వివరణ త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కమిటీ తదుపరి సమావేశం ఈనెల 21న జరగనుంది
కాగా, తన పేరిట పత్రికా ప్రకటన తయారైన మాట వాస్తవమేనని, అందులో స్పీకర్ పై కొన్ని వ్యాఖ్యలు ఉండడంతో తాను సంతకం చేయలేదని, అది తనకు తెలియకుండానే మీడియాకు లీకిందని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రివిలేజ్ కమిటి సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని, తనకు వ్యవస్థలపైన, చట్టంపైన అపార గౌరవం ఉందని చెప్పారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోయినా, ఒక నోట్ ఆధారంగా తనకు నోటీసులు ఇచ్చినా సరే, ఇది తప్పని కమిటీ భావిస్తే విచారం వ్యక్తం చేయడానికి, క్షమాపణలు చెప్పడానికి తనకేమీ భేషజాలు లేవని, ఇదే విషయాన్ని కమిటీకి చెప్పానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.