Sunday, January 19, 2025
HomeTrending Newsప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న

మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అని ప్రకటించిన సిఎం జగన్ ఈ మూడింటిలో ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి ఉద్యమం మొదలై వెయ్యిరోజులు పూర్తవుతున్న సందర్భంగా  రైతులు మరోసారి మహా పాదయాత్రకు వెళ్తుంటే మరోసారి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విభజించి పాలించు.. నినాదంతో మున్డుకేలుతోందని, బ్రిటీష్ వారి తర్వాత మళ్ళీ ఆ బాటలో జగన్ నడుస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు అయన సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన పోస్ట్ చేశారు.

“మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో మూడు రాజధానులు అని ఊగారు. మళ్ళీ సౌండ్ లేదు. మూడు రాజధానులలో కూడా ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేసింది లేదు. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు ఉత్తరాంధ్ర వెళుతున్నారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది, ఈ మూడేళ్ళలో ఈ అసమర్థులు మన ప్రాంతానికి చేసింది ఏముంది? అని.. అందుకే ఈ కలవరపాటు.. అందుకే ఈ ఆక్రోశం.. అందుకే ఈ అడ్డంకులు.. అందుకే దండయాత్ర అంటూ ఏడుపులు. అందుకే తమకు చేతనైన ఓకే ఒక విద్య.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టడం అనే దాన్ని నమ్ముకున్నారు..

వీరికి నిజంగా దమ్ముంటే ఈ మూడు సంవత్సరాల మూడు నెలలలో ఉత్తరాంధ్ర కోసం వీరు చేసిన అభివృద్ధిని చెప్పాలి. ఉన్నట్లుండి ఉత్తరాంధ్ర కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్న ఉత్తరాంధ్ర మంత్రులు నిజంగా ప్రశ్నించాల్సినది జగన్ ను.. మూడేళ్ళుగా వందలాది జగన్ అనుయాయులు రాయలసీమ ఇతర ప్రాంతాల నుండి ఉత్తరాంధ్రకు వచ్చి హోటళ్ళు, లాడ్జి లు, గెస్ట్ హౌస్ ల్లో తిష్ఠ వేసి ఉత్తరాంధ్ర లో భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్మెంట్ లు ఎందుకు చేస్తున్నారు అని? ఉత్తరాంధ్ర పై వారంతా మూడేళ్లుగా ఎందుకు దండయాత్ర చేస్తున్నారు అని.. కొద్ది మంది రైతులు, నాలుగు రోజులు పాదయాత్ర చేసి దైవ దర్శనం చేసుకోవడాన్ని దండయాత్ర అంటున్న మంత్రులు నిజంగా తమకు ఆత్మాభిమానం, ఆత్మ సాక్షి ఉంటే తమని తాము ప్రశ్నించుకోవాలి.. మూడేళ్ళుగా ఇక్కడ A2 విజయసాయి రెడ్డి వెలగ బెట్టిన కార్యం ఏమిటి? అతడికి, అతడి బంధువులకు, జగన్ రెడ్డి ఇక్కడ తిష్ఠ వేయించిన ఇతర రాబందులు అందరికీ ఉత్తరాంధ్ర లో ఏమి పని? ఉత్తరాంధ్ర వైసీపీలో ఉన్న మంత్రులు, నాయకులు అందరూ అసమర్ధులా? ఒక్కరూ సమర్థులు లేరని జగన్ అభిప్రాయమా? అందుకే ఇక్కడ విజయసాయి రెడ్డి ని సామంత రాజుగా నియమనించాడా? అందుకే ఇక్కడ విజయసాయి రెడ్డి ని ఉత్తరాంధ్ర సీఎం అని వైకాపా శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ పిలిచారా? అతగాడు , అతడి గుంపు అంతా మూడేళ్ళూ ఇక్కడే ఉండి భూ దందాలు తప్ప, ప్రజలకు రాష్ట్రానికి పనికొచ్చే పని ఏమి చేశారు? ఆఖరుకు విశాఖ మణిహారం రుషికొండ ను కూడా గుల్ల గుల్ల చేస్తూ ఉంటే ఒక్క వైకాపా నాయకుడికి కూడా బాధ కలగలేదా? ఒక్కరైనా ఇది తప్పు అని తమ అసంతృప్తిని వెలిబుచ్చారా? విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తారని ఉద్యోగులు, విపక్షాలు నిరసనలు తెలుపుతూ ఉంటే.. విశాఖ ఉక్కుకు చెందిన 7500 ఎకరాలు తెగనమ్మితే సరిపోద్ది అన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు అమ్మడం, తనాఖాలు పెట్టడం తప్ప ఏమి ఒరగబెట్టారు?

రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారు.. వైకాపా రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి నేడు ఇది ఉత్తరాంధ్ర పై దండయాత్ర అంటే ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి.. దానికి తగినట్లుగానే 20 సంవత్సరాల ప్రణాళిక, ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతీ ప్రాంతం యొక్క అభివృద్ధికి బాటలు వేశారు. ఉత్తరాంధ్ర ప్రజలైనా, రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలు అయినా శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని కోరుకుంటారు. పనీ పాటా లేని వెధవలు, రాజకీయ ప్రయోజనాల కోసం, తమ అసమర్థతను దాచడం కోసం, విషయాన్ని పక్కదారి మళ్లించడానికి దండయాత్ర వంటి పదాలతో ప్రజలను రెచ్చగొడుతూ ఉంటారు. వారికి చెంప పెట్టు అనే విధంగా, తమ గోడు దేవునితో మొరపెట్టుకోవడానికి పాదయాత్ర చేస్తున్న రైతులకు మన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఆతిథ్యం ఇచ్చి అండగా నిలిచి వారికి స్వాగతం పలుకుదాం. ధర్మం, న్యాయం, సత్యం గెలవాలి. అవి న్యాయస్థానాలు చూసుకుంటాయి. సాటి మనుష్యులుగా రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగమిచ్చిన రైతులకు మాట సాయం చేయకపోయినా, వారికి హాని తలపెట్టకపోవడం మన ధర్మం. రైతులను బెదిరిస్తున్న వైసీపీ రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా వారి దుష్ట ప్రణాళికలను ధైర్యంగా తిప్పికొడదాం.

రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కానీ కేవలం పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదు అన్న విషయం తెలిసి కూడా నటిస్తున్న పాలకులు ఇక నటనలు చాలించాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మధ్య ప్రాంతాల వారీగా, కులాల వారీగా చిచ్చు పెట్టడం మానుకోవాలి.” అంటూ పోస్ట్ చేశారు.

Also Read ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్