Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం

India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం

ఆసీస్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. లక్ష్యం పెద్దదైనా….  ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బెదరలేదు. చక్కని పోరాట స్పూర్తి ప్రదర్శించింది. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లతో అద్భుత విజయం సాధించింది. ఇండియా విసిరిన 209 పరుగుల విజయ లక్ష్యాన్ని19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్సర్లతో 61; మాథ్యూ వాడే 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపు మొగ్గినా ఆసీస్ బ్యాట్స్ మెన్ పట్టు వీడకుండా విజయంవైపు జట్టును నడిపించారు.

మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ-11; విరాట్ కోహ్లీ-2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కెఎల్ రాహుల్- సూర్య కుమార్ యాదవ్ లు మూడో వికెట్ కు 68 పరుగులు జోడించారు.  రాహుల్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55;  సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి రాణించారు. అక్షర్ పటేల్(6); దినేష్ కార్తీక్ (6)లు విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా మరోసారి తన ప్రతాపం చూపి 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో హర్షల్ పటేల్ పాండ్యాకు అండగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది.

ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు; హాజెల్ఉడ్ రెండు; కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆసీస్ 39 పరుగుల వద్ద తొలి వికెట్ (కెప్టెన్ పించ్-22) కోల్పోయింది. ఆ తరువాత కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్ లు భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.  గ్రీన్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో స్మిత్-35( 24 బంతులు, 3ఫోర్లు, 1 సిక్స్); గ్లెన్ మాక్స్ వెల్ (1) ఇద్దరూ ఔటయ్యారు. జోస్ ఇంగ్లిస్ 10 బంతుల్లో 3  ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. 14 బంతుల్లో ఒక ఫోర్; ఒక సిక్సర్ తో 18 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ చివరి ఓవర్ మొదటి బంతికి ఔట్ కాగా కమ్మిన్స్ తొలి బంతినే ఫోర్ గా మలిచి విజయం అందించాడు.

ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, ఉమేష్ యాదవ్ రెండు, చాహల్ ఒక వికెట్ పడగొట్టారు.

గ్రీన్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్