Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: సెమీఫైనల్లో ఆసీస్

మహిళల వరల్డ్ కప్: సెమీఫైనల్లో ఆసీస్

Aussies -Semis: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వరుసగా ఐదు విజయాలతో  సెమీఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో సెమీస్ లో అడుగుపెట్టిన మొదటి  జట్టు ఆసీస్ కావడం విశేషం. కాగా ఇండియా మూడో పరాజయం చవిచూసింది. ఇప్పటికి ఐదు మ్యాచ్ లు ఆడిన ఇండియా రెండిటిలో మాత్రమే విజయం సాధించింది.  నేడు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపొందింది.

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా 28 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు (స్మృతి మందానా-10; షఫాలీ వర్మ-12) కోల్పోయింది.  మూడో వికెట్ కు కెప్టెన్ మిథాలీ రాజ్-  యస్తికా భాటియా 130 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.  యస్తికా 59; మిథాలీ 68, హార్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులు చేశారు. చివర్లో పూజా వస్త్రాకర్ కూడా ధాటిగా ఆడి 34 పరుగులతో రాణించడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు, అలానా కింగ్ 2, జోనాసేన్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఆసీస్ నిలకడగా ఆడింది. తొలి వికెట్ కు 121 పరుగులు చేసింది. అలెస్సా హీలీ 72 పరుగులు చేసి అవుట్ కాగా ఆ వెంటనే రేచల్ హేన్స్ (43) కూడా పెవిలియన్ చేరింది. తర్వాత కెప్టెన్ లన్నింగ్-పెర్రీ లు మూడో వికెట్ కు 103 భాగస్వామ్యం నెలకొల్పారు. పెర్రీ 28, కెప్టెన్ లన్నింగ్ 97 పరుగులు  చేశారు, 3 పరుగులతో లన్నింగ్ సెంచరీ మిస్ చేసుకుంది. చివర్లో బెత్ మూనీ చరుగ్గా ఆడి 30 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.  ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు; స్నేహ్ రానా, మేఘనా సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

చివరి రెండు ఓవర్లలో 11 పరుగులు కావాల్సి ఉండగా లన్నింగ్ అవుట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరం కాగా బెత్ మూనీ రెండు ఫోర్లు ఒక సింగల్ తో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరేలా తోడ్పడింది.

లన్నింగ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్