Saturday, November 23, 2024
HomeTrending Newsటి 20 విజేత ఆస్ట్రేలియా

టి 20 విజేత ఆస్ట్రేలియా

ఐసిసి టి 20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై  ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. కివీస్ విసిరిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ రాణించడంతో 18.5 ఓవర్లలోనే  సాధించింది. ఓపెనర్, కెప్టెన్ పించ్ మరోసారి విఫలమయ్యాడు. ఐదు పరుగులు మాత్రమే చేసిన పించ్ మూడో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్ లో మిచెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వార్నర్, మార్ష్ రెండో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వార్నర్ 38 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో 53 పరుగులు చేసి, బౌల్ట్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్ వెల్ తో కలిసి మార్ష్  మరో వికెట్ పడకుండానే లక్ష్యాన్ని సాధించారు.  మిచెల్ మార్ష్  50 బంతుల్లో 6ఫోర్లు,  4 సిక్సర్లతో 77; మాక్స్ వెల్ 18 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

అంతకుముందు, ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 28 వద్ద కివీస్ తొలి వికెట్ (దెరిల్ మిచెల్-11) కోల్పోయింది. గుప్తిల్, కెప్టెన్ విలియమ్సన్ లు రెండో వికెట్ కు 48 పరుగులు జోడించారు. గుప్తిల్ 25 స్కోరు చేసి పెవిలియన్ చేరాడు.  కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి 48 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లతో 85 పరుగులు చేసి 18ఓవర్లో ఔటయ్యాడు.  గ్లెన్ ఫిలిప్స్-18; నీషమ్-13; టిమ్ సీఫెర్ట్-6 పరుగులు చేశారు. న్యూ జిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్