రాష్ట్రంలో ముస్లిం సోదరుల ఆస్తులు అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని, మైనార్టీలపై దాడులు కూడా ఎక్కువయ్యాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. షాదీ తోఫా కింద ఇచ్చే ఆర్ధిక సాయానికి జగన్ ప్రభుత్వం ఎన్నో అంక్షలు పెట్టిందని, కేవలం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ పన్నాగం పన్నారని విమర్శించారు. మంగళగిరి సికె కన్వెన్షన్ హాల్ లో తెలగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రన్న ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముస్లింల దయ వల్లే సమైఖ్య రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అదృష్టం తనకు దక్కిందన్నారు. హైదరాబాద్ లో మతకల్లోలాలు అణచి వేయడంలో గట్టిగా వ్యవహరించి, మత సామరస్యం కాపాడామని చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన ఘనత, హజ్ హౌస్ నిర్మాణం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. మైనార్టీ రిజర్వేషన్స్ కాపాడడానికి కూడా గట్టి చర్యలు తాము తీసుకున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో వాజ్ పేయి హయంలో ఉర్దూ యూనివర్సిటీ ని నెలకొల్పామన్నారు. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ, కర్నూలుల్లో హజ్ హౌస్ లు; కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్ధించి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ముస్లిం సోదరులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.