ఒక నేరానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణలో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వద్దకు వెళ్లిందని, ఈ కుంభకోణానికి సంబంధించిన రూపకర్త, నిర్మాత, దర్శకత్వం, విలన్..అన్నీ నారా చంద్రబాబునాయుడే నన్న బలమైన సాక్షాధారాలతో అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిందని, చేసిన నేరానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి దబాయిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రకంగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు,
రిమాండ్‌కు పంపడం పెద్ద విషయం అని మేము అనుకోవడం లేదని, బలమైన ఆధారాలున్నాయి కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా రుజువు అవుతుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. బాబు అరెస్టుపై సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడే వీరంగం వేశాడని, జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై తన ఇంట్లో పడుకున్నట్లు లాసంగా పడుకుని కాలుమీద కాలు వేసుకుని పడుకున్నాడని విమర్శించారు.
అరెస్టు చేయగానే గౌరవంగా హెలికాఫ్టర్ పెడితే బాబు పబ్లిసిటీ డ్రామాలేశారని, నిన్న ఆయన చేసిన డ్రామా చూస్తే పబ్లిసిటీ కావాలని తపన పడ్డట్లు అనిపించిందని, డీఐజీతో ఎదురుగా కూర్చుని ఒక కెమెరా పెట్టించుకుని దబాయించారని, ఆ అధికారి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి సరిపోయిందన్నారు. ఆయన కొడుకు లోకేష్ కూడా మామూలు బూతులు మాట్లాడలేదని, అక్కడ పోలీసు అధికారిని పట్టుకుని ఇష్టారీతిన మాట్లాడాడని గుర్తు చేశారు. మంత్రిగా చేశాడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవిస్తే…అసలు ఏమనుకుంటున్నారు…వాళ్లేమన్నా జీతగాళ్లు, పాలేర్లు అనుకుంటున్నారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ఆయన తప్పు ఉందని, ఆ తప్పు బయటకు రావాలని, భవిష్యత్తులో మరొకరు అలా చేయకూడదని జగన్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని వివరించారు.