బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని.. వేరే ఇతర అంశాల జోలికి జగన్ వెళ్లరని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని సజ్జల గుర్తు చేశారు
2014 కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారని… బిజెపిలో ఉన్న టిడిపి మాజీ నాయకులు ఈ పొత్తు కోసం లోపాయికారి ప్రయత్నాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని… దానిలో భాగంగానే ఈ భేటీ జరిగి ఉండొచ్చని సజ్జల అన్నారు. చంద్రబాబు అవసరం ఉందంటూ బిజెపి నాయకత్వాన్ని కూడా వారు ప్రభావితం చేస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు
జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్తే తాటాకులు కట్టే కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు చంద్రబాబు సమావేశంపై ఏం చెబుతారని ప్రశ్నించారు. బత్తుల లేకుండా పోటీ చేసే ధైర్యం బాబు చేయలేరన్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక కులం ఆధారంగానే ఏ పార్టీ అధికారంలోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇలా అధికారంలోకి రావాలనుకున్నవారికి పరిస్థితి ఏమైందో చరిత్ర చెబుతోందని ఆయన గుర్తు చేశారు. పవన్ ప్రజల్లో తిరగొచ్చని ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు సూచించడంలో తప్పేమీ లేదని సజ్జల వ్యాఖ్యానించారు. బాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు కేవలం గెస్ట్ ఆర్టిస్ట్ లు గానే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, వారెవరికి ఇక్కడ నివాసం లేదన్నారు.