Friday, November 22, 2024
HomeTrending NewsKarumuri: చెల్లుబాటుకాని నాణెం ఎందుకు?: కారుమూరి

Karumuri: చెల్లుబాటుకాని నాణెం ఎందుకు?: కారుమూరి

ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని, అసలు దొంగ ఓట్లను చేర్పించిందే చంద్రబాబు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు. కుప్పంలో 40 వేల ఓట్లు అక్రమంగా చేర్పించారని అన్నారు. ఓటర్ ఐడిని ఆధార కార్డు తో అనుసంధానం చేస్తున్నారని, అందుకే  ఒక చోట కంటే ఎక్కువ ఉన్నవారిని తొలగిస్తున్నారని తెలిపారు.  నిర్దిష్టంగా ఫలానా చోట ఈ  ఓట్లు తీసేశారని ఎక్కడా చెప్పలేకపోతున్నారని, ఎందుకంటే ఈ ఓట్లు చేర్పించింది వారు కాబట్టేనని మంత్రి విమర్శించారు.

నిన్న రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక్కచోట చూశామని, అప్పట్లో వెన్నుపోటు పొడిచినప్పుడు చూశామని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని  ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ నాణెం విడుదల చేసినప్పుడు జనంలో చెల్లుబాటయ్యేవి ఇవ్వాలి కానీ నామమాత్రంగా ఎందుకని కారుమూరి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి సమయంలో వెంట ఉన్నది లక్ష్మీ పార్వతి మాత్రమేనని, భార్య అయిన ఆమెను నిన్నటి కార్యక్రమానికి పిలవకపోవడం సరికాదన్నారు.

గత ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక పేరుతో దందా చేశారని, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా దోచేశారని.. మా హయంలో  ఖజానాకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.  రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసింది చంద్రబాబేనని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ కు కలిసొచ్చే ఓటు మాత్రమే ఉంటుందని, వ్యతిరేక ఓటు ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు.  పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వారం వారం పోలవరం అంటూ కూడా పనులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఈ ప్రాజెక్టు జాప్యం చంద్రబాబు చలవేనని అన్నారు.

టిడిపి కార్యకర్తలు, యువత ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద స్థాయి పదవులు ఇస్తామంటూ లోకేష్ చెప్పడంపై కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇలా చెప్పడానికి బుద్ధుందా అంటూ లోకేష్ ను నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్