Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా రాబోతోన్న నేపథ్యంలో… బాబు అక్కడ పర్యటించి రాష్ట్రమంతా ఒకే రాజధాని కోరుకుతున్నారనే విషయాన్ని తెలియజెప్పాలని అనుకున్నారని పేర్కొన్నారు. కానీ అక్కడి ప్రజలు తిరగబడ్డారని, పరిపాలనా వికేంద్రీకరణపై తన వైఖరి చెప్పాలని బాబును డిమాండ్ చేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. టిడిపి అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు అన్నట్లుగా అనుకోవాల్సి వస్తుందన్నారు.
బాబు పర్యటనలో తమ పార్టీ కార్యకర్తలు ఎక్కడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయలేదని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు తన రాజకీయ విధానాలేమిటో చెప్పుకోవచ్చు గానీ, ప్రజలను బూతులతో, అసభ్యకరమైన రీతిలో దాడికి పాలడడం దారుణమని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తికి ఇంత అసహనం తగదన్నారు. ఇటీవల పవన్ కూడా ఇలాగే చెప్పులు చూపిస్తూ పూనకంతో ఊగిపోతూ మాట్లాడారని గుర్తు చేశారు.
శ్రీ బాగ్ ఒడంబడిక, ఆంధ్ర ప్రదేశ్ విభజన లాంటి పరిణామాల తర్వాత ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరూ పరిపాలనా వికేంద్రీకరణపై ఆలోచన చేయాలని, కానీ చంద్రబాబు ఆ ప్రయత్నం చేయలేకపోయారని దుయ్యబట్టారు. గత ముఖ్యమంత్రుల్లో కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే అభివృద్ధి విషయంలో వికేంద్రీకరణ చేసి చూపించారని అన్నారు. గతంలో తప్పిదాలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సిఎం జగన్ మూడు రాజధానులకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
కర్నూలులో పర్యటిస్తుంటే అక్కడి ప్రజలు ఈ అంశంపై నిలదీయరని బాబు ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. ఆయా పార్టీల విధానాలపై ప్రజల్లో ఏవైనా అపోహలు ఉంటే వాటినితొలగించే ప్రయత్నం చేయాలి గానీ, ఎదురుదాడి చేయడం మంచి పద్దతి కాదని సజ్జల హితవు పలికారు.