అమరావతిలో నిరుపేదలకు ఇళ్ళు వస్తుంటే చంద్రబాబు కంట రక్త కన్నీరు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆయనవి, ఆ పార్టీ నేతలవి అన్నీ వికృత చేష్టలని, తన హయంలో వ్యవస్థలన్నింటినీ బాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. అమరావతి అంటే ఆకాశ హర్మ్యాలు, నిరుపేదలు వెళ్ళలేని పెద్ద పెద్ద భవంతులు మాత్రమే అనుకుంటున్నారని, కానీ సిఎం జగన్ మాత్రం అక్కడ 54 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చూస్తున్నారని సుధాకర్ బాబు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజధాని ప్రాంతంలో నివసించేందుకు అర్హత లేదా అని ప్రశ్నించారు, బాబు కుట్రలను బడుగు,బలహీన వర్గాలు గమనిస్తున్నాయన్న విషయ్నాన్ని తెలుసుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు.
విషపూరిత రాజకీయ కుట్రలను, తన భావజాలంలో ఉన్న అంటరానితనాన్ని, వెనుకబడిన కులాలపై ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు మరోసారి బైట పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇంకా మా జాతిని అంతరానివారుగానే బాబు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, తమ వర్గాలకు అమృతం దక్కకపోయినా ఇంకా విషాన్ని తాగించాలని చూస్తున్న బాబు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అమరావతిలో పేదల ఇళ్ళస్థలాలు ఇచ్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ తీర్పును ఉభయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు స్వాగతించలేకపోతున్నాయని నిలదీశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న సదుద్దేశంతో జగనన్నకు చెబుదాం అనే ఓ గొప్ప కార్యక్రమం చేపడితే ఒర్లే (వర్ల) రామయ్య తో దీన్ని అపహాస్యం చేసేలా ప్రయత్నించడం శోచనీయమన్నారు.