Monday, January 20, 2025
HomeTrending NewsChandrababu Naidu: నీతుల నాని: పేర్నిపై బాబు విమర్శలు

Chandrababu Naidu: నీతుల నాని: పేర్నిపై బాబు విమర్శలు

బటన్ నొక్కి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెబుతున్న సిఎం జగన్ కు… బటన్ బొక్కుడు వల్ల ఎంత దోచుకున్నారో చెప్పే ధైర్యం ఉందా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  జగన్ ఇచ్చింది 2 లక్షల కోట్లు అయితే దోచుకున్నది కూడా రెండు లక్షల కోట్లు అని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరో రెండు లక్షల  కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు బుధవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.  సిఎం జగన్ క్యాన్సర్ లాంటి వ్యక్తీ అని,  ఎవరికైనా క్యాన్సర్ వస్తే కుటుంబానికి నష్టం అని, జగన్ పాలనతో రాష్ట్రానికే క్యాన్సర్ వచ్చే ప్రమాదం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ సిఎం మరో పది నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గెలిచిన తరువాత సిఎం జగన్ ఆకాశం నుంచి కిందకు దిగాడని, గతంలో ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోని జగన్ ఇప్పుడు డబ్బులిస్తానంటూ వారిని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలను కాళ్ళు పట్టుకొని, డబ్బులిచ్చి వారిని దగ్గరకు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్నాడని వ్యాఖ్యానించారు.

మహిళల స్వావలంబనకు, వారి ఆర్ధిక స్వాతంత్రానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని, సంక్షేమ కార్యక్రమాలకు నంది పలికింది కూడాతామేనని చెప్పారు. వెనుక బడిన వర్గాలకు సబ్ ప్లాన్, ఎస్సీలకు 29 పథకాలు తెచ్చామని, ఎస్టీలు, మైనార్టీలను కూడా ఆదుకున్నామని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని రద్దు చేశారని ఆరోపించారు.

పేర్ని నాని పై విమర్శలు చేస్తూ నీతుల మంత్రిగా బాబు అభివర్ణించారు. ఇసుక ఎక్కడకు పోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే ఆయన కన్ను పడుతుందన్నారు. ఇళ్లస్థలాల పేరుతో ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారన్నారు.  బందరు అంటేనే లడ్డు గుర్తుకు వస్తుందని, అలాంటి బందరు లడ్డు నానికి దొరికిందన్నారు. పోర్టు తో బందరు రూపురేఖలు మార్చాలని తాము నిర్మాణం మొదలు పెట్టామని,  ఇప్పుడు దాన్ని నిలిపివేశారని, కేవలం డబ్బుల కోసం పోర్టును నాశనం చేసిన వ్యక్తి జగన్ అని బాబు విమర్శించారు.

జోగి రమేష్ పర్సెంటేజ్ మంత్రి అని, ఆయనకు తన మన అనే తేడా లేదని, సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు కప్పం కట్టాల్సిందేఅని ధ్వజమెత్తారు. ఎవరైనా సరే 20శాతం ఆయనకు ఇవ్వాల్సిందే అని విమర్శలు చేశారు. ప్రజల్లో చైతన్యం రావాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని ప్రజలకు బాబు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్