Sunday, January 19, 2025
HomeTrending Newsమరో ‘పులివెందుల’గా గన్నవరం: బాబు ఫైర్

మరో ‘పులివెందుల’గా గన్నవరం: బాబు ఫైర్

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఐదు కార్లు, స్కూటర్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన, విజయవాడకు దగ్గరలో ఉన్న గన్నవరంలో ఈ పరిస్థితి ఉంటే ఏమనుకోవాలని, తాను పర్యటిస్తానంటే కూడా అడ్డుకున్నారని, గన్నవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ప్రశ్నించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసును బాబు పరిశీలించారు. ఈ ఆఫీసులో భయానక వాతావరణం సృష్టించారని, టెర్రరిస్టులు  కూడా ఇలా చేయరని వ్యాఖ్యానించారు.

కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారు పేరు అని, పింగళి వెంకయ్య, పట్టాభి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్ లాంటి మహనీయులు పుట్టిన జిల్లా అని, ఇలాంటి ప్రదేశంలో రౌడీలు, సైకోలు స్వైర విహారం చేస్తున్నారని,  ఏ రౌడీ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల వింత చేష్టలు తనకు అర్ధం కావడం లేదని, పనికిమాలిన వేషాలు  వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ ను నమ్ముకున్న వాళ్ళంతా జైలుకు వెళ్ళారని, మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీ ఖర్మ అంటూ పోలీసులనుద్దేశించి అన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  టిడిపి కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రేపు తాను అధికారంలోకి రాగానే తీసుకెళ్ళి మక్కెలు విరగ్గొడితే ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని కాపాడే వరకూ తాను పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుంటే  ప్రజల మాన, ధన, ప్రాణాలకు రక్షణ ఉండబోదని తేల్చి చెప్పారు.  కృష్ణా జిల్లాలోనే ఇలా ఉంటే ఇక పులివెందులలో ఎలా ఉంటుందో అలోచించుకోవాలన్నారు.  గాన్నవరంకూడా మరో పులివెందులలాగాతయారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Also Read : గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి: అచ్చెన్న ఆగ్రహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్