బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి‘ అనే సినిమాలో నటిస్తున్నారు. మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో బాలయ్య సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సంక్రాంతికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన జై బాలయ్య సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య, వరుసగా సక్సెస్ లు సాధిస్తున్న అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఎప్పటి నుంచో అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికి సెట్ అయ్యింది. డిసెంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘రామారావు గారు’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే… ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి..? అనిల్ రావిపూడి స్టైల్ లో కామెడీగా ఉంటుందా..? బాలయ్య స్టైల్ లో పవర్ ఫుల్ గా ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. అనిల్ రావిపూడి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది తెలియచేశారు. ఇంతకీ స్టోరీ ఏంటంటే.. ముప్పై ఐదేళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి ఏభై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట. బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ.. మరో వైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయని… అలాగే సినిమాలో ఫాదర్ – డాటర్ మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తానికి బాలయ్య కోసం అనిల్ సరికొత్త కథని రెడీ చేశారు. మరి.. ఏ స్టోరీతో ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.