మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హేగ్డే నటిస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. ఈ సినిమాను ఏ ముహుర్తంలో స్టార్ట్ చేశారో కానీ.. అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే… ఇప్ప‌టికి స‌గం సినిమా పూర్త‌య్యేది.

న‌వంబ‌రులో షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటే… మ‌హేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. కృష్ణ ఆక‌స్మిక మ‌ర‌ణంతో.. మ‌హేష్ ఇంకొన్నాళ్లు షూటింగ్ కి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. డిసెంబ‌రులో ఎట్టిప‌రిస్థితుల్లోనూ కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్టాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్లాన్‌. మ‌హేష్ కూడా షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకోమని చెప్పారని తెలిసింది. అయితే.. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. 2023 ఏప్రిల్ లో ఈ మూవీని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఏప్రిల్ లో రావడం కష్టం ఇక దసరాకే ఈ సినిమా వస్తుందని అనుకుంటున్నారు సినీజనాలు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అంటే..ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో నాటికి షూటింగ్ అవ్వాలి. మార్చిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటుగా, ప్ర‌మోష‌న్ల కూడా కంప్లీట్ చేయాలి. మూడు నెల‌ల్లో సినిమాని పూర్తి చేయడం అనేది బాగానే ఉంది కానీ.. త్రివిక్ర‌మ్ అంత ఫాస్ట్ కాదు. పైగా… పెద్ద కాంబినేష‌న్ ఇది. అంద‌రి కాల్షీట్లూ స‌ర్దుబాటు కావాలి. మ‌ధ్య‌లో ఎలాంటి అడ్డంకులు రాకూడ‌దు. మరి.. ఇంతకు ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందో.. వాయిదా పడుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *