బాలానగర్ ఫ్లై ఓవర్ కు బాబూ జగ్జీవన్ రామ్ పేరు పెడుతున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఈరోజు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ ఫ్లైఓవర్ కు అయన పేరుపెట్టమని వచ్చిన విజ్ఞప్తులను గౌరవించి ఈ ఫ్లై ఓవర్ కు వారి పేరు పెడుతున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరో’ అని ఒక మహనీయుడు కవిత రాశారని, లక్షలాది మంది కార్మికులు మనం చేపడుతున్న ప్రాజెక్టుల్లో నిమగ్నమై పని చేస్తున్నారని, వారిని గౌరవించు కోవాలన్నది మన ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన అని చెప్పారు. అందుకే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలితోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని కేటియార్ వివరించారు.
కేసియార్ నాయకత్వంలో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ హైదరాబాద్ విశ్వనగరం దిశగా సాగుతోందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోందని, దీనిలో భాగంగా మొదటి దశలో ఆరు వేల కోట్ల రూపాయలతో వివిధ బ్రిడ్జిలు, అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నామని కేటియార్ చెప్పారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోనే గత ఏడేళ్ళలో రోడ్ల నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
387 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ నేడు ప్రారంభమైంది. 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లు, 6 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.