వైసీపీ రీజినల్ కోర్డినేటర్ పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియా ప్రచారమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత కట్టింగ్ అండ్ పేస్టింగ్ ఎక్కువయ్యాయని వ్యాఖ్యానిచారు. పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేసుకుంటామని, బాలినేని వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదేనని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి పదవి నుంచి తప్పించడం, ఒంగోలు,బాపట్ల, నెల్లూరు రీజినల్ కోర్డినేటర్ నుంఛి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మార్చడంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సిఎం జగన్ మార్కాపురం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. బాలినేనిని సిఎం హెలీప్యాడ్ వద్దకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆయన సభకు హాజరు కాకుండానే ఒంగోలు బయల్దేరారు. విషయం తెలుసుకున్న సిఎం జగన్ స్వయంగా బాలినేనిని వెనక్కు రప్పించి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు ఆయనతో కలిసి బటన్ నొక్కిం విడుదల చేశారు. రెండ్రోజుల క్రితం జిల్లా సమీక్షా సమావేశానికి కూడా బాలినేని హాజరు కాలేదు. పార్టీ అధినాయకత్వంతో పాటు జిల్లాకు చెందిన మంత్రి సురేష్ వ్యవహార శైలిపై కూడా అయన తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. దీనితో అయన తన పార్టీ పదవినుంచి తప్పుకున్నారని, ఈ సమాచారాన్ని పార్టీ పెద్దలకు తెలియజేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై కాకాణి స్పందించారు.
పార్టీలో బాలినేని సీనియర్ నేతగా ఉన్నారని, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని.. ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలగబోదని, ఎవరైనా అలా ప్రవర్తించినా వాటిని సరిదిద్దే చర్యలు తప్పకుండా చేపడతామని వివరించారు.