Sunday, November 24, 2024
HomeTrending Newsకేసు మాఫీ కోసం మోకరిల్లిన కమ్యూనిస్టులు - సంజయ్ ధ్వజం

కేసు మాఫీ కోసం మోకరిల్లిన కమ్యూనిస్టులు – సంజయ్ ధ్వజం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు టీఆర్ఎస్ నేతలు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు… ‘‘ కేసీఆర్… యూజ్ లెస్ ఫెలో.. ఎవడ్రా మీకు చదువు, సంస్కారం నేర్పింది? బతికున్నవాళ్లకు సమాధి కడతారా? ‘‘అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు సహా ఇఛ్చిన హామీలన్నీ విస్మరించిన నీకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అట్లా చేస్తే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అంటూ దుయ్యబట్టారు. గొల్ల కురుమలకు గొర్ల పైసలు రాకుండా ఫ్రీజ్ చేయాలంటూ తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని కేసీఆర్ ను నిలదీశారు.

దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భార్యాపిల్లలతో కలిసి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని… ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మనుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ ఈ సందర్భంగా మండల కేంద్రానికి రాగానే వేలాది జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాముల యాదవ్, కొప్పు భాష, రిథేష్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేలాది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• కార్యకర్తలను కంట్రోల్ చేయడం చేతగాకుంటే అన్నీ మూసుకుని ఉండు…. నేను ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదు. బతికున్న వ్యక్తికి సమాధి కడతారా? తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యే లేదని చెప్పిన కేసీఆర్… మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారమైందని చెప్పిన కేసీఆర్…. ఫ్లోరోసిస్ సమస్య పై జేపీ నడ్డా పేరుతో సమాధి ఎట్లా కట్టినవ్?

• చలిదొన లక్ష్మీనర్సింహాస్వామి సాక్షిగా చెబుతున్నా…. నా భార్యాపిల్లలపై ఒట్టేసి చెబుతున్నా… రేపు నేను భార్యాపిల్లలతో నేనొస్తా… దమ్ముంటే కేసీఆర్ నువ్వు, నీ కుటుంబం ఇక్కడికి రా…. ప్రమాణం చేద్దాం రా…. గొల్ల కురుమలకు డబ్బులివ్వడం చేతగాక… ఆ సాకును నాపై రుద్దుతావా? కేసీఆర్… దమ్ముంటే టైం.. డేట్ ఫిక్స్ చేయ్… నా సవాల్ ను స్వీకరించాలి. లేకుంటే మునుగోడు ప్రజలు తరిమితరిమి కొడతారు.. కల్లాకపటం లేని గొల్లకురుమల ఉసరు ఊరికే పోదు…

• కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలంటేనే వణుకు పుడుతోంది. అందుకే జ్వరం పట్టుకుంది. కొడుకేమో ట్విట్టర్లో,… బిడ్డ లిక్కర్లో… అల్లుడు దొంగ మాటల్లో….సడ్డకుడి కొడుకు కమీషన్లలో…ఇదీ కేసీఆర్ కుటుంబం తీరు…

• ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్ధి ఉన్నారా? ఆయన ఎవరికి అన్యాయం చేయలే.. ఆపదొస్తే సాయం చేసే వ్యక్తి. అందుకే రాజగోపాల్ రెడ్డి వస్తే మంగళహారుతులు పడతారు… కానీ ఇంకో అభ్యర్ధి వస్తే మహిళలు ఇండ్లల్లోకి పోయి తలుపులు మూసుకునే దుస్థితి. రాజగోపాల్ రెడ్డి ఏనాడైనా కబ్జాలు చేశారా? కమీషన్లు తీసుకున్నారా?

• సిద్దిపేటలో దుబ్బాక లచ్చమ్మ మెడలో తాళిబొట్టుకు గుంజుకుపోయిన దుర్మార్గుడు కేసీఆర్…. దండుపాళ్యం ముఠా లెక్క ఇయాళ మునుగోడుపై పడ్డరు. తెలంగాణ ఉద్యమ సమయంలో బిచ్చపు బతుకు కేసీఆర్ ది. ఫైనాన్స్ కట్టలేదని సొంత కారును, ప్రచార రథాన్ని కూడా ఫైనాన్స్ వాళ్లు, మంజీరా బ్యాంకు వాళ్లు గుంజుకుపోయిండ్రు. దీనికి గాదె ఇన్నయ్యే సాక్షి. ఆనాడు నయాపైసా లేని కేసీఆర్… ఇయాళ 100 కోట్ల రూపాయలతో సొంత విమానం ఎట్లా కొన్నావ్? వేల కోట్ల ఆస్తులను ఇరాన్, ఇరాక్, దుబాయ్, చైనా, బంగ్లాదేశ్ లో ఎట్లా పెట్టుబడులు పెట్టినవో ప్రజలకు సమాధానం చెప్పాలా? కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి గురించి ఆరోపణలు చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే కన్పిస్తోంది.

• ఇంకో ఏడాది సమయం ఉన్నా…. పదవి ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? రైతులకు రుణమాఫి ఎందుకు చేయలేదు? నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు? పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? నియోజకవర్గానికి పెద్దాసుపత్రి, డిగ్రీ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? మా నాంపల్లి మండలంలో పసునూరు చెరువు తప్ప సాగు నీరుకు దిక్కేలేదు. లక్ష్మణ చెరువును ఎందుకు బాగు చేయలేదని అడిగేందుకు సమయం ఇవ్వాలని అడిగితే కనీసం అపాయిట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదు.. అందుకే కదా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది.

• ఉప ఎన్నికలొస్తేనే సీఎం వస్తడు.. రోడ్లంటడు… పెన్షన్లు, రేషన్ కార్డులంటడు. ఎన్నికలు కాంగనే మళ్లీ పోయి ఫాంహౌజ్ లో పడుకునే వ్యక్తి కేసీఆర్….రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చౌటుప్పల్ కు రోడ్డు వచ్చింది. గట్టుప్పల్ మండలం వచ్చింది. చేనేత బంధు వచ్చింది. పెన్షన్లు వచ్చినయ్… బస్తీ దవాఖానా రాబోతోంది.

• ఒక్క వ్యక్తిని ఎదుర్కొవడానికి దండుపాళ్యం ముఠా పడ్డది. గుంట నక్కలు గుంపులుగా వచ్చినయ్… రాజగోపాల్ రెడ్డి సింహం… సింగిల్ గా వచ్చిండు… గతంలో హుజూరాబాద్ లోనూ డబ్బును టీఆర్ఎస్ నేతలు ఏరులై పారించారు. అక్కడి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు… హుజూరాబాద్ తీర్పుతో ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్ ను ఇందిరాపార్క్ కు గుంజుకొచ్చినవ్… ఇప్పుడు పిచ్చోడిలెక్క దేశమంతా తిరుగుతున్నరు.

• కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్లు… ఆ నాయకులకు సిగ్గు లేదు.. కమ్యూనిస్టు సిద్ధాంతాలను, పోరాటాలను కూసీఆర్ వద్ద తాకట్టు పెట్టారు. సొంత పగ కోసం ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను హత్య చేసిన కేసులో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఏ1 గా ఉన్నారు. ఆ కేసును మాఫీ చేయించడం కోసం ఏకంగా పార్టీనే తీసుకెళ్లి కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారు. మీకు బీజేపీపై కోపంగా ఉంటే సిద్దంతా పరంగా కొట్లాడి ఓడగొట్టొచ్చు.. కానీ సిద్దాంతాలను పక్కనపెట్టి… పార్టీ సిద్దాంతాలను, పోరాటాలను సీఎం వద్ద తాకట్టు పెట్టారంటే ఒక్కసారి ఆలోచించాలి.

•  దసరా చీరల పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ నుండి చీరలు తీసుకుని చేనేత కార్మికుల పొట్టన కొట్టిన మూర్ఖుడు కేసీఆర్..

• తెలంగాణలో 1400 మంది యువత బలిదానం చేసుకున్నరు. కేసీఆర్ పై ఏం కేసులున్నయ్. వాళ్ల త్యాగాలపై భోగాలు అనుభవిస్తు కోట్లు సంపాదిస్తున్నడు. తెలంగాణ తల్లి రోదిస్తోంది… కేసీఆర్ కబంధ హస్తాల్లో బంధీ అయిన… బంధవిముక్తి చేయాలని మునుగోడు ప్రజలను వేడుకుంటోంది. తెలంగాణ తల్లికి బంధ విముక్తి జరగాలంటే… మునుగోడులో టీఆర్ఎస్ ను తరిమితరిమికొట్టాలే…. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించాలని కోరుతున్నా…

• రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ గాళ్లు ఏం చేస్తరని అవహేళన చేసిన వాళ్లకు కరీంనగర్ లో వాళ్ల సత్తా చూపి నన్ను గెలిపించారు… యువత సహా ప్రతి ఒక్కరూ వ్యాపారాలు, పనులను పక్కనపెట్టి మీ సత్తా చూపి బీజేపీని గెలిపించాలని వేడుకుంటున్నా.

Also Read : మునుగోడు భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు- బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్