న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న ముక్కోణపు టి 20 సిరీస్ లో నేడు జరిగన మ్యాచ్ లో బంగ్లాపై కివీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.  న్యూజిలాండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానం లోనే ఈ మ్యాచ్ లన్నీ జరుగుతున్నాయి. ఒక్కో జట్టూ మిగిలిన రెండిటితో  రెండేసి మ్యాచ్ లు ఆడుతోంది. ఇప్పటికే కివీస్, పాక్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. కివీస్ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు విజయాలు సాధించింది. రేపు పాక్- బంగ్లా మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఎల్లుండి ఫైనల్ జరుగుతుంది.

నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టులో ఓపెనర్లు కాన్వే-64; ఫిన్ అల్లెన్ -32  పరుగులతో రాణించగా, గుప్తిల్ 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.  బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ఎబాదత్ హోస్సేన్ చెరో రెండు, షోరిఫుల్ ఇస్లామ్ ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్  24 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 70 పరుగులతో రాణించాడు. లిట్టన్ దాస్- సౌమ్య సర్కార్ చెరో 23 పరుగులు చేశారు.  వేగంగా పరుగులు రాబట్టడంలో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నీ మూడు; టిమ్ సౌతీ, మిచెల్ బ్రేస్ వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

గ్లెన్ ఫిలిఫ్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *