0.1 C
New York
Thursday, December 7, 2023

Buy now

Homeసినిమాబహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

‘Grand’mother of Telugu Films Banumathi  :
వెండితెరపై కథానాయికగా రాణించాలంటే అందం ఉంటే .. అభినయం తెలిస్తే సరిపోతుంది. ఇక గానం కూడా తెలిసి ఉంటే మరీ మంచిది. అప్పట్లో ఎవరి పాత్రలకు వాళ్లు డబ్బింగ్ చెప్పుకునేవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. అలాగే పాట .. పద్యం వస్తే ఇక తిరుగే లేదు అన్నట్టుగా ఉండేది. అందువల్లనే నేమో అన్నీ నేర్చేసుకుని మరీ భానుమతి రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి భానుమతి సినిమాల వైపుగా వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె చాలా చురుకుగా .. చలాకీగా ఉండేవారట. ఏ విషయమైనా వెంటనే గుర్తుపెట్టేసుకోవడం .. వెంటనే నేర్చేసుకోవడం ఆమెకి చిన్నప్పటి నుంచి తెలిసిన విద్య. 

భానుమతి తండ్రికి శాస్త్రీయ సంగీతంపై మంచి పట్టు ఉండేది. అందువలన సహజంగానే ఆమెకి సంగీతంపై మక్కువ ఏర్పడింది. భానుమతి కళ్లు చాలా అందంగా ఉంటాయనీ .. ఆ కళ్లు ఎలాంటి హావభావాలనైనా చక్కగా పలికిస్తాయని అప్పట్లోనే అంతా చెప్పుకునేవారు. చక్కని గాత్రంతో పాటు ఆకర్షణీయమైన రూపంతో ఉన్న భానుమతికి 13వ ఏటనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా ఆమె వర విక్రయంఅనే సినిమాతో తెలుగు తెరకి 1939లో పరిచయమయ్యారు. చిన్నప్పటి నుంచి భానుమతి కాస్త బొద్దుగానే ఉండేవారు. అందువలన ఆమె తన వయసుకు కాస్త మించి కనిపించేవారు. 

ఇక చిత్తూరు నాగయ్యతో కలిసి ఆమె చేసిన స్వర్గసీమమంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఓహోహో పావురమాఅనే పాటలో భానుమతి గ్లామర్ ను చూసి ఎంతోమంది ఆమె అభిమానులుగా మారిపోయారు. ఈ పాటను ఆమె స్వయంగా ఆలపించారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ సరసన చేసిన ‘మల్లీశ్వరి’ .. ‘సారంగధర’, ఏఎన్నార్ తో చేసిన ‘విప్రనారాయణ’ .. ‘అంతస్తులు’ సినిమాలు అశేష ప్రేక్షకుల హృదయాలలో భానుమతికి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. భానుమతి చీరకట్టు .. పొడుగు బొట్టు మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చిన్నప్పటి నుంచి కూడా భానుమతిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ‘నీకు ఏమేం వచ్చామ్మా? అని అడిగితే, ‘ఏం రాదని అడగండి’ అంటూ గడుసుగా సమాధానం ఇచ్చిందట. అదే ఆత్మవిశ్వాసంతో ఆమె తన కెరియర్ ను చివరివరకూ నడిపించగలిగారు. దర్శక నిర్మాత అయిన రామకృష్ణగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లోనే పెద్దలను ఎదిరించిన తీరు ఎవరినైనా ఆశ్చర్యపరచక మానదు. ఎవరు ఏమైనా అనుకోని తాను ఏదైతే అనుకున్నారో అది చేయడానికి ఆమె ఎంతమాత్రం జంకేవారు కారు. 

ఎవరినీ లెక్క చేయనితనం కారణంగా భానుమతి కొన్ని సినిమాలను వదులుకోవలసి వచ్చిందని అంటారు. అలాంటి వాటిలో మిస్సమ్మఒకటి. ఈ సినిమా కోసం ముందుగా భానుమతినే తీసుకున్నారు. కొంత షూటింగు జరిగిన తరువాత కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆమెకి చక్రపాణితో మాటపడవలసి వచ్చింది. ఆయనకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చేసి వెనుదిరిగిన కారణంగానే, ఆ ఛాన్స్ సావిత్రికి వెళ్లింది. ఆ సినిమాతోనే సావిత్రి తన హవాను మొదలుపెట్టేసి మహానటిగా ఎదిగిపోయారు. అప్పట్లో రెగ్యులర్ గా సినిమాలు తీసే బ్యానర్లు చాలా తక్కువ. వాళ్లతో గొడవపెట్టుకుంటే కష్టమనే భయం ఆమెకి ఎంతమాత్రం లేకపోవడం విశేషం. 

తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన సావిత్రి – జమునల నుంచి భానుమతికి గట్టిపోటీ ఎదురైంది. నటన పరంగా సావిత్రి .. గ్లామర్ పరంగా జమున తమ జోరును పెంచారు. అలాంటి పరిస్థితుల్లోను తన కోసం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేసుకోవడం భానుమతి ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఇక కాలంతో పాటు తాను మారుతూ తల్లి పాత్రలను .. అత్తగారి పాత్రలను .. బామ్మ పాత్రలను చేస్తూ వెళ్లారు. అయితే ఆ పాత్రలు కూడా ఆమె స్థాయికి తగినవిగానే ఉండేవి. అవసరమైతే ఆమెను ప్రధానంగా చేసుకునే టైటిల్స్ ఉండేవి. ఆ జాబితాలో మంగమ్మగారి మనవడు‘ .. ‘అన్నపూర్ణమ్మగారి అల్లుడు‘ .. ‘బామ్మమాట బంగారు బాటమొదలైనవి కనిపిస్తాయి.

సాధారణంగా చిత్రపరిశ్రమలో కథానాయికల మాట చెల్లదు. తమకి ఇష్టమైన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉండదు. అలాగే తమకి నచ్చని విషయాలను ధైర్యంగా చెప్పే సాహసం కూడా వారు చేయరు. కానీ భానుమతి అలా కాదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చివరి సినిమా వరకూ ఆమె ఏదైతే అనుకున్నారో అదే చేశారు. బహుశా మరెవరి విషయంలో ఇలా జరిగి ఉండకపోవచ్చు. ఫలానా విధంగా అయితేనే చేస్తాను .. నా పాటలు నేనే పాడుకుంటాను వంటి కొన్ని నిబంధనలను అంగీకరిస్తూనే ఆమెతో చేయించేవారు. భానుమతికి గల ప్రతిభ .. ఆమె వ్యక్తిత్వం అందుకు కారణమని చెప్పుకోవాలి.

భానుమతి ఆలపించిన పాటలలో .. ఓహోహో పావురమా(స్వర్గసీమ) మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి ) ఓ బాటసారి ననూ మరువకోయి (బాటసారి) దులపర బుల్లోడా (అంతస్తులు)  శరణం నీ దివ్య చరణం (మట్టిలో మాణిక్యం ) శ్రీసూర్యనారాయణ మేలుకో (మంగమ్మగారి మనవడు) ముందువరుసలో కనిపిస్తాయి. ఇక భానుమతి తనకి వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళితే చాలని అనుకోలేదు. భరణి స్టూడియోను స్థాపించి వరుస సినిమాలను నిర్మించారు. దర్శకత్వంలోను తనకి ప్రవేశం ఉందనిపించారు. 

భానుమతి రాసిన అత్తగారి కథలుకి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం దక్కింది. ఇలా భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలిగా 5 దశాబ్దాలుగా తన కెరియర్ ను కొనసాగిస్తూ 100 సినిమాల వరకూ నటించారు. తన ప్రతిభకు కొలమానంగా పద్మశ్రీ .. పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు తెరపై భానుమతి మాట ప్రత్యేకం .. ఆమె పాట ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు తెరకి లభించిన అరుదైన బహుమతి .. భానుమతి. అలాంటి భానుమతి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం. 

(వర్ధంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read సామాజిక, కుటుంబ విలువలు నేర్పిన ఆదుర్తి సినిమాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్