రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని, చేతినిండా పని లభించిందని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ఆరంభించారని చెప్పారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు రూపొందించామన్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.339.73 కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా అమలవడం లేదని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.3.70 కోట్ల విలువైన లక్షా 9 వేల 775 చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.
Also Read :