వెనుకబడిన వర్గాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని, బిసిలే పార్టీకి వెన్నెముకగా నిలిచారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బిసిలకు టిడిపి శాశ్వతంగా రుణపడి ఉంటుందన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి లో పర్యటిస్తున్న చంద్రబాబు నేడు బిసిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. బిసిలకు సబ్ ప్లాన్ కూడా తెచ్చామని, కుల వృత్తులను ఆదుకున్నామని గుర్తు చేశారు. తెలుగుదేశం హయంలో బిసిలు ఏ విధంగా ఉన్నారు, వైసీపీ పాలనలో ఎలా ఉన్నారనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
బిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెబుతున్న జగన్ ప్రభుత్వం వీటి ద్వారా వారికి ఎలాంటి మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుతంలో విదేశీ విద్య పథకం ద్వారా బిసి కుటుంబాల నుంచి ఎంతోమంది యువత విదేశాల్లో విద్య, ఉపాధి పొందారని చెప్పారు. సిఎంగా ఉన్నప్పుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని, కానీ జగన్ మాటలు తప్ప చేతల్లో ఏమీ లేదని దుయ్యబట్టారు,.
రాష్ట్రంలో ఆస్తులు దోచుకొంటున్నారని, ప్రజలు మాత్రం పేదవారిగా ఉండాలని అనుకుంటున్నారని జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. వైసీపీ నేతల ధన దాహానికి అంతు లేకుండా పోయిందని, ఎక్కడ నది, వాగు కనబడినా ఇసుకను దోచేస్తున్నారని, సామాన్య ప్రజలకు ఇసుక దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.