హైదరాబాద్‌లోని షాహినాయత్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని శుక్రవారం అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని పోలీసులు విచారణలో బయటపడింది. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్‌ను హత్య చేసిన వెంటనే నిందితులు కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడకు చేరుకున్న వెస్ట్‌జోన్ పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నీరజ్ భార్య సంజన సోదరులు, వారి స్నేహితులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు.
శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై తాత జగదీష్ పన్వర్‌తో కలిసి నీరజ్ వెళ్తుండగా సంజన సోదరులు కాపుకాచి హత్యకు పాల్పడ్డారు. విచక్షణా రహితంగా తాత జగదీశ్ పన్వర్ కళ్ల ముందే పొడిచి చంపారు. నీరజ్ తల, మెడ, ఛాతీ భాగం సహా శరీరంపై 15 సార్లు కత్తితో పొడిచారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే హత్య చేశారని పోలీసుల ప్రాథమిక నిర్ధారించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. కర్ణాటక గుడిమత్కల్‌లో నిందితులను గుర్తించారు. ఐదుగురు నిందితులు రెండు వాహనాల్లో అక్కడ నుంచి పరారయినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది.
ఈ కేసులో ఇప్పటి వరకూ 10మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు నిరసనగా ఈ రాను (శనివారం) బేగంబజార్ మూసివేస్తున్నట్లు కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. నిందితులను తక్షణమే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపి శిక్షించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఏడాది కిందటే సంజన, నీరజ్‌లు వివాహం చేసుకోగా వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. పన్వర్ మార్వాడీ కాగా.. సంజన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువతి. రెండు వారాల వ్యవధిలోనే నగరంలో పరువు హత్యలు చోటుచేసుకోవడం గమనార్హం. మే మొదటి వారంలో సరూర్ నగర్‌లో ఓ యువకుడ్ని అమ్మాయి అన్నదమ్ములు దారుణంగా హత్య చేశారు.