Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం9వ నెలలో నృత్యకారిణి సాహసం

9వ నెలలో నృత్యకారిణి సాహసం

బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే సాహసం ఎవరూ చెయ్యలేదు. తాజాగా బెంగళూరుకు చెందిన యగ్నికా అయ్యంగార్ అరుదైన ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించారు.

వరుసగా ఏడుగురు బిడ్డలను పోగొట్టుకుని ఎనిమిదో సంతానంగా విష్ణు భగవానుడే జన్మించినా కంసుడి భయానికి పొత్తిళ్లలోని బిడ్డని కన్నీళ్లతో వసుదేవుడికి అప్పగించింది దేవకి. బాలకృష్ణుడి బుడిబుడి అడుగులు ఆమెకు తెలియదు. చిన్నికృష్ణుడి వెన్న దొంగతనాలు, ముద్దు మాటలు, ఇతర లీలల గురించి తెలియకుండా జైల్లో ఉండిపోయింది. బలరామకృష్ణులు వచ్చి కంసుని చంపి తల్లిదండ్రులను విడుదల చేసేవరకు అంతే. ఎప్పుడూ ఎక్కడా దేవకి మనోభావాల గురించి ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. పైగా దేవకి దురదృష్టవంతురాలని, యశోద ధన్యురాలని అంటారు.

కానీ బెంగళూరుకు చెందిన యగ్నికా అయ్యంగార్ అలా అనుకోలేదు. తొలిసారిగా తల్లి కాబోతున్న ఈ మహిళ దేవకి తరఫున ఆలోచించింది. కడుపులో పెరుగుతున్న కృష్ణుడితో దేవకి తీయని అనుబంధం అందరికీ తెలియాలనుకుంది. తన ఆలోచనలను ఊహారూపంలో ప్రదర్శించేందుకు నృత్య మాధ్యమాన్ని ఎంచుకుంది. ఆరునెలలపాటు కృషి చేసి నెలలు నిండుతుండగా తొమ్మిదో నెలలో ప్రదర్శన ఇచ్చి…భళా అనిపించుకుంది.

యగ్నికా అయ్యంగార్ యోగా గురువు. అనేక నృత్య రీతుల్లో ప్రావీణ్యం ఉంది. ఎంతోమందికి యోగా, నాట్యం నేర్పించారు. ఆ ధైర్యంతో, చేయగలననే నమ్మకంతో, గురువులు, వైద్యుల భరోసాతో ‘మాతృత్వం’ నృత్య రూపకాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అందుకు దేవకి ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. పుట్టిన బిడ్డని దూరం చేసుకున్న దేవకిని దురదృష్టవంతురాలనడం సరికాదంటారీమె. కడుపులో బిడ్డ ఉండగా తల్లితో అనుబంధం ఏర్పడుతుందని అది ఒక మధురానుభూతి అంటారు. దేవకి కూడా అటువంటి అనుభూతికి లోనయ్యే ఉంటుందని, ఆ సంతోషాన్ని, బిడ్డతో పెంచుకున్న బంధాన్ని చక్కటి నృత్య రూపకం ద్వారా చెప్పాలనుకున్నారు. అయితే కడుపులో బిడ్డను మోస్తూ రిహార్సల్స్ చెయ్యడం చాలా కష్టం. దీన్ని తన అనుభవంతో ప్లాన్ చేసి సాధించారు.

భరతనాట్యం భంగిమలు కష్టంగా ఉంటాయి. యోగాలో కూడా ప్రావీణ్యం ఉండటంతో యగ్నిక తన కదలికలు సురక్షితంగా ఉండేలా రూపొందించారు. అన్నీ పూర్తయి ప్రదర్శనకు సిద్ధమనుకున్న తరుణంలో మామగారి మరణం యగ్నికను దెబ్బతీసింది. ప్రదర్శన రద్దు చేయాలనుకున్నారు. కానీ ఆమె పడ్డ కష్టం వృధా కాకూడదని భర్త, అత్త ప్రోత్సహించారు. దాంతో డిసెంబర్ 7 న ప్రదర్శన ఇచ్చారు యగ్నిక. ప్రేక్షకులనూ ఉత్కంఠకు గురిచేసిందీ రూపకం. పూర్తయ్యాక అందరూ నుంచుని యగ్నికకు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. గంటకు పైగా ఉన్న మాతృత్వం నృత్య రూపకం తనకు-బిడ్డకు ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసిందంటారీమె. ఆ సమయంలో ప్రతి కదలికా కష్టమే అయినా ఇష్టంగా అధిగమించానంటున్న యగ్నిక దేవకీ కృష్ణుల బంధాన్నేకాదు…ప్రతి తల్లికీ బిడ్డతో పెనవేసుకునే అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

-కె . శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్