Sunday, January 19, 2025
HomeTrending Newsమహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై, థానే నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని, దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోతుందని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి  చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. కోష్యారీ యథాలాపంగా చేసిన ఈ వాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. నిన్న ముంబైలోని అంధేరీలో ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్.. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై, థానే నుంచి బయటకు పంపిస్తే ఇక్కడ పైసా మిగలదని తాను ప్రజలకు చెబుతూ ఉంటానన్నారు.అదే జరిగితే భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ఇకపై అలా ఉండబోదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.


మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కష్టపడి పని చేసే మరాఠీ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండేకు కూడా ఇది అవమానం అన్నారు. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలు బిచ్చగాళ్లని భావించేలా గవర్నర్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీఎం షిండేకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా.. గవర్నర్‌తో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వీడియోను కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ కూడా ఓ ట్వీట్లో తప్పుబట్టారు. ఓ రాష్ట్ర గవర్నర్ అదే రాష్ట్ర ప్రజల పరువు తీయడం దారుణమన్నారు. చివరికి తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిందని గుర్తించిన గవర్నర్ కోష్యారీ… మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధిలో రాజస్థాన్, గుజరాత్ ప్రజల సహకారం గురించి చెప్పేందుకే అలా మాట్లాడనన్నారు. మహారాష్ట్రను ఈ స్థాయిలో నిలపడానికి మరాఠీలు ఎంతో కష్టపడ్డారన్నారు. వాళ్లను కించపరిచే ఉద్దేశం తనకు లేదని గవర్నర్ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్