కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే పనిలో పడ్డారు. ప్రజలను నేరుగా కలిసేందుకు సమాయత్తం అవుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో జరిగే ఈ కార్యక్రమం దాదాపు 5 నెలల పాటు జరగనుంది. మొత్తం 37,571 కిలోమీటర్ల మేర సాగే రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్ర, దేశంలోని 68 లోకసభ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగుతుంది.
ప్రతి రోజు రాహుల్ గాంధీ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ నెల చివరిలో తెలంగాణలో ప్రవేశించి వికారాబాద్ జిల్లా మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతుంది.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో 100 కిలో మీటర్లు ప్రయాణిస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ప్రయాణం చేయనున్నారు. ప్రజలను కలవనున్నారు. ఓబులాపురం, ఆలూర్, ఆదోని, పెద్ద తుంబలం, మాధవరం ప్రాంతాల్లో రాహుల్ పర్యటించనున్నారు.