తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈనెల 24న హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఎల్లాపూర్ లో ప్రవేశించిన పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులోని కాకతీయ కళాతోరణం వద్ద ముగిసి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం గుండ్లగూడెం గ్రామంలోకి ప్రవేశించింది. ఏడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర హనుమకొండ, జనగామ జిల్లాలో 98 కిలోమీటర్ల మేర పూర్తి చేసుకున్నది.
హనుమకొండలో 47 కిలోమీటర్లు, జనగామలో 51 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది.
గత నెల 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర జనగామ జిల్లా నర్మెట్ట గ్రామానికి చేరుకునే నాటికి 500 కిలోమీటర్ల మైలు రాయిని జనగామ జిల్లాలో పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి భట్టి విక్రమార్కను అభినందించారు.
వరదన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్రలో సీఎల్పీ నేతపట్టి విక్రమార్క లక్షల మంది ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పరిశీలించారు. కాకతీయ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలు తెలుసుకున్నారు. పాదయాత్రలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హనుమకొండ, నర్మెట్ట గ్రామంలో తడిసి ముద్దయ్యారు. జనగామ జిల్లాలో మొక్కజొన్న పంటలు, తడిసిన ధాన్యం పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఏడు రోజులపాటు కొనసాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. గ్రామాల్లో స్థానిక సమస్యలను, వ్యక్తిగత సమస్యలను ప్రజలు భట్టి విక్రమార్కతో ఏ కరువు పెట్టి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తులు చేశారు. ప్రజల సమస్యలు ఆలకిస్తూ వారి వినతులు తీసుకుంటూ రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. దారి పొడవున గ్రామా, గ్రామానా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు ఎదురొచ్చి స్వాగతం పలికి భట్టి విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.