ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమాగా ‘భ్రమయుగం’ కనిపిస్తుంది. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందడమే అందుకు కారణం. మలయాళం ఆడియన్స్ సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఆకాశం నుంచి ఊడిపడే కథలను కాకుండా, జనం మధ్యలో నుంచి వచ్చే కథలను ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఒక కథతో నిర్మితమైన సినిమానే ఇది. బ్రిటీష్ వారి కాలంలో కేరళ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
చక్రవర్తి రామచంద్ర – శశికాంత్ నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. ఇది హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సినిమా. మొన్న శుక్రవారం రోజున మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ తొలిరోజునే 3 కోట్లను వసూలు చేసింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. కథను ఎంచుకున్న తీరు .. దానిని హ్యాండిల్ చేసిన విధానం అందుకు కారణమని అంటున్నారు. మమ్ముట్టి కెరియర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానంలో నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మలయాళంతో పాటు తెలుగులోను మొన్న శుక్రవారం రోజునే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది గనుక, తెలుగులోనూ రిలీజ్ చేయడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇంతవరకూ తెలుగులో ఒకటి .. రెండు పోస్టర్లు వదిలారంతే. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు. మరి ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.