వినోద ప్రియులు మరీముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా ప్రతిష్టాత్మక రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ స్టార్ మా ఛానెల్ లో సెప్టెంబర్ 5, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది . గత సీజన్ గ్రాండ్ ఫైనల్, భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేని రీతిలో అత్యధికంగా రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. వాటిని తిరగరాసే రీతిలో ఈసారి బిగ్‌బాస్ షోను ప్లాన్ చేశారు.
‘స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మాపట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్‌బాస్ తెలుగు మరో సీజన్‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు.
బిగ్‌బాస్ ఐదవ సీజన్‌కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ “ గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను” అన్నారు నాగ్