సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సామాజిక వేత్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. 80 ఏండ్ల పాఠక్ మంగళవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో పొల్గొన్నారు. గుండెలో ఇబ్బందిగా ఉండటంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పాఠక్ పోరాటం చేశారు. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి పాటుపడ్డారు. పాఠక్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా..
భారత్‌లో పబ్లిక్ టాయ్‌లెట్ల నిర్మాణకర్తగా బిందేశ్వర్ పాఠక్ నిలిచిపోయారు. ఇప్పుడు మనం వింటున్న స్వచ్ఛ భారత్‌కు ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే అంకురార్పణ చుట్టి టాయిలెట్ మ్యాన్ ఆప్ ఇండియాగా పేరొందారు. బీహార్‌లోని వైశాలి జిల్లా రాంపూర్ బాగేల్‌లో జన్మించారు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత కొన్ని ఉద్యోగాలు చేశారు. తర్వాత భంగీ-ముక్తీ (స్కావెంజర్స్ లిబరేషన్)లో చేరారు. పారిశుద్ధ్య కార్మికులను శ్రమదోపిడీ చేశారని ఆయన పోరాటం చేశారు. దేశ వ్యాప్తంగా వారి సమస్యల పరిష్కారానికి తిరిగేవారు. తన పీహెచ్‌డీ థీసిస్ సమర్పణలో భాగంగా ఆయన మాన్యువల్ స్కావెంజర్స్‌తో కలిసి ఉండేవారు.
బంధువుల నుంచి ఛీత్కారాలు
అతని చేస్తున్న పనికి పలుసార్లు ఎగతాళికి గురయ్యారు. సాక్షాత్తు తన మామగారే తన కూతురి జీవితం నాశనమైపోయిందంటూ బాధపడ్డారని, తన అల్లుడు ఏం పనిచేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని నిందించేవాడని పాఠక్ తెలిపారు. పాఠక్ 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ వంటివి ప్రోత్సహించేది. మూడు దశాబ్దాల క్రితమే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్లను బయో గ్యాస్ ప్లాంట్లకు అనుసంధానం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అనుసరిస్తున్నాయి. 1974లో ఆయన చరిత్రలో నిలిచిపోయేలా సామూహిక మరుగుదొడ్డి సౌకర్యాన్ని ప్రారంభించారు. మరుగుదొడ్లతో పాటు స్నానం, లాండ్రీ, మూత్ర విసర్జన సౌకర్యాలతో అందులో ఉద్యోగులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు స్వల్ప మొత్తం చార్జీతో సేవలందిస్తున్న సులభ్ సౌచాలయ కాంప్లెక్స్ దేశంలో లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మనం బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర బహిరంగ ప్రదేశాలలో వినియోగిస్తున్న సులభ్ కాంప్లెక్స్‌లు పాఠక్ చలవే.
ఎన్నో సంస్కరణలు
సామాజికంగా పేరుకుపోయి ఉన్న అలవాట్లు ప్రజలతో మాన్పించడానికి ఆయన పెద్ద పోరాటమే చేశారు. బహిరంగ మలవిసర్జన అలవాటును మాన్పించి, అందరికీ అందుబాటులో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా మరుగుదొడ్లను నిర్మించారు. పాత మరుగుదొడ్డి విధానానికి స్వస్తి పలికేందుకు దేశవ్యాప్తంగా 1749 పట్టణాల్లో సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇళ్లలో 13 లక్షలు, 5.4 కోట్ల పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. దీని కోసం అత్యంత చవకైన టు పిట్ సాంకేతికత వాడారు. మాన్యువల్ స్కావెంజర్స్ ఎలాంటి రక్షణ తొడుగులు, పరికరాలు లేకుండా చేతులతోనే మానవ వ్యర్థాలను తొలగించడం చూసి ఆయన చలించిపోయారు. దాని నివారణకు పోరాటం చేశారు. 1991లో కేంద్ర ప్రభుత్వం పాఠక్‌ను పద్మ భూషణ్‌తో సత్కరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డు అయిన ఎనర్జీ గ్లోబల్ అవార్డును కూడా పొందారు. అలాగే ఫ్రెంచ్ సెనేట్ నుంచి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డు అందుకున్నారు.