Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Binny Mill : ఒకానొకప్పుడు మద్రాసు నగరంలో ప్రముఖ వస్త్ర సంస్థగా ఉండేది బిన్నీ మిల్లు. అయితే ఈ రోజు గోదాముగానూ, సినిమా షూటింగులకు ఉంటోందా స్థావరం. ఈ మిల్లుకి రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది.

ఈస్టిండియా కంపెనీవారు మద్రాసులో వ్యాపారం చేపట్టడంతోనే వారితో వర్తకం చేయడానికి ఇంగ్లండు నుంచి వచ్చిన ఆంగ్లేయులలో ఒకరు చార్లస్ బిన్నీ.

1769 ప్రాంతంలో మద్రాస్ వచ్చిన చార్లస్ బాన్నీ వాలాజా నవాబుతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్రాసులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. ఆయన కుటుంబసభ్యులు నవాబు దగ్గర పని చేశారు. వారిలో ఒకరు జాన్ బిన్నీ. ఈ జాన్ బిన్నీయే తర్వాతి రోజుల్లో బ్రహ్మాండంగా వృద్ధి చెందిన బిన్నీ మిల్లుకి బీజం వేశారు.

మద్రాసు నగరంలోని మౌంట్ రోడ్డు (ఇప్పుడు అన్నాశాలై అంటున్నారు)లో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ఉంటున్న చోట జాన్ బిన్నీ పూర్వం ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. మద్రాసుకు వచ్చే నౌకలలోని వస్తువుల ఎగుమతి దిగుమతుల వ్యవహారాలన్నింటినీ ఈయన ఇక్కడి నుంచే నిర్వహించారు. కొంతకాలం తర్వాత ఈ సంస్థ ఇప్పుడున్న తాజ్ కన్నిమెరా హోటల్ చోటుకు మారింది.

అనంతరం 1812లో ప్యారిస్ కార్నర్లో ఉన్న ఆర్మీనియన్ వీధికి మారినప్పటికీ 1820 వరకూ జాన్ బిన్నీ ఇక్కడున్న ఇంట్లోనే ఉండేవారు. అందుకు గుర్తుగా ఇప్పటికీ ఆ రోడ్డుని బిన్నీ రోడ్డు అని పిలువబడుతోంది.

ఈ మధ్యలో 1800లో జాన్ బిన్నీ టెనిసన్ అనే అతనితో చేతులు కలపడంతో సంస్థ పేరు బిన్నీ అండ్ టెనిసన్ అనే ఉండేది.

పోర్ట్ ట్రస్టుకి దగ్గర్లో ఉండటంవల్ల ఆర్మీనియన్ స్ట్రీట్ కి మారాక 1814లో ఈ సంస్థ పేరు “బిన్నీ అండ్ కో” గా మారింది.

నౌక నుంచి సరకులు తీరానికి తరలించడానికి ఈ సంస్థకు ముప్పైకి పైగా చిన్న పడవలుండేవి.

అనంతరం వాటిని వివిధ ప్రాంతాలకు తీసుకుపోవడానికి బస్సులను వినియోగించేవారు.

క్రమంగా వ్యాపారాన్ని విస్తరించడానికి బిన్నీ బ్యాంక్ తదితర రంగాలలోనూ అడుగుపెట్టారు. చివరికి బిన్నీ సంస్థను తానొక్కడే నడపడం వస్త్ర వ్యాపార రంగంలో జాన్ బిన్నీకి ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.

బిన్నీ అండ్ కో సంస్థ ఉత్తర చెన్నై (నార్త్ మద్రాసు) లోని పెరంబూర్ ప్రాంతంలో 1877 లో బకింగ్ హాం మిల్లుని ఆరంభించింది. అదే బిన్నీ మిల్లయ్యింది.

మరో అయిదేళ్ళకు అంటే 1882లో కర్నాటిక్ మిల్లు ప్రారంభమైంది. ఎందరికో ఉపాధి కల్పించిన ఈ మిల్లులు 1920లో ఏకమయ్యాయి. దీంతో 14000 మంది కార్మికులతో కూడిన భారీ పరిశ్రమగా ఈ బిన్నీ మిల్లు మారింది.

ఇక్కడ ఉత్పత్తులు స్థానికంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి ఆవుతుండేవి. ఈ సంస్థ తయారుచేసేవి నాణ్యతకు మన్నికకు పేరుపొందాయి.

ఈమధ్యలో 1884లో బెంగళూరూలో బెంగళూరు కాటన్, సిల్క్ – ఉలెన్ మిల్లును ప్రారంభించింది. అప్పట్లో మన దేశంలో ఉఃడిన బ్రిటీష్ పాలకులు బిన్నీ అండ. కో ఉత్పత్తులనే పెద్దమొత్తంలో కొనుగోలుచేసేవారు. ప్రజల నుంచి కూడా విశేష గుర్తింపు లభించింది.

ఇలా అంచెలంచెలుగా ఎదిగిన బిన్నీ సంస్థకు ఇరవయ్యో శతాబ్దం అంతగా కలిసిరాలేదు. మద్రాసులో నడిచిన అర్బుత్ నాట్ బ్యాంక్ (Arbuthnot Bank) 1906లో దివాలా తీయడం బిన్నీమీద పిడుగుపడ్డట్టయ్యింది. కిందామీదా పడి నెట్టుకొద్దామనుకునేసరికి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీంతో బిన్నీ వ్యాపారం క్రమంగా తరిగిపోయింది.

1970లలో వచ్చిన వరదలప్పుడు బిన్నీ మిల్లులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు రెండు శతాబ్దాలపాటు మద్రాసు వ్యాపార చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన బిన్నీ మిల్లు అనేక కారణాలతో 1996లో పూర్తిగా మూతబడింది. దీంతో ఇందులో పని చేసిన వేలాది మంది ఉపాధి కోల్పోయారు. 2001లో ఈ మిల్లులను అమ్మేసారు. కార్మిక సంఘాల చరిత్రలోనూ బిన్నీకి మూఖ్యపాత్ర ఉంది. 1915లో వస్త్ర వ్యాపారి సెల్వపతి చెట్టియార్ బిన్నీ మిల్లులో ఆరంభించిన కార్మిక సంఘమే దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం.

ఆయన వల్లే చెన్నైలో మొట్టమొదటిసారిగా మే డే సంబరాలు జరిగాయి. తిరు వి.కా. సారథ్యంలో 1921లో బిన్నీ మిల్లులో జరిగిన సమ్మె భారతదేశ కార్మిక సంఘ చరిత్రలో అతి ముఖ్యమైనది.

ఇలా నిజమొన కార్మికోద్యమాలు చూసిన బిన్నీ మిల్లు ఈరోజు షూటింగులతో చెన్నై నగర మౌనసాక్షిగా ఉండటం గమనార్హం.

– యామిజాల జగదీశ్

Also Read :

నాటికీ నేటికీ వన్నతగ్గని ఎల్ఐసి కట్టడం!

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com