Friday, April 19, 2024
HomeTrending Newsనాటికీ నేటికీ వన్నతగ్గని ఎల్ఐసి కట్టడం!

నాటికీ నేటికీ వన్నతగ్గని ఎల్ఐసి కట్టడం!

Lic Building Chennai : మద్రాసులో నా చిన్నప్పుడే కాదు ఇప్పటికీ గుర్తుకొచ్చే కట్టడాలలో మౌంట్ రోడ్డులోని ఎల్.ఐ.సి. LIC ఒకటి. ఈనాటి యువతరాన్ని ఎల్ఐసి కట్టడం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా ఎత్తయిన కట్టడాలెన్నో మద్రాసులో దర్శనమిస్తున్నాయి కనుక.
ఫినిక్స్ మాల్, సిటీ సెంటర్, విఆర్ మాల్, విజయా మాల్, మాయాజాల్, ఎక్స్ ప్రెస్ అవెన్యూ‌ అంటూ ఎన్నో మాల్స్ వచ్చేసాయి. కానీ 1960 దశకంలో మద్రాసులో అందరి దృష్టినీ ఆకర్షించిన కట్టడం ఏదంటే అది ఎల్ఐసి కట్టడం ఒక్కటే. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ఏదో ఒక సన్నివేశంలో ఎల్ఐసీ కట్టడాన్ని చూపించేవారు. పద్నాలుగు అంతస్తుల ఈ కట్టడాన్ని చూడటంకోసమే మౌంట్ రోడ్డుకి వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇతర ప్రాంతాల వారితో ఎల్ఐసి కట్టడం గురించి చెప్పకుండా ఉండరు.

కొత్త పెళ్ళికూతురులా నవ్యంగా భవ్యంగా ఉన్న ఈ ఎత్తయిన కట్టడం వెనుక ఎన్నో విషయాలున్నాయి.

మద్రాసులో మొట్టమొదటి ఎత్తయిన కట్టడం ఎల్ఐసీ భవనమే. అంతేకాదు మన దేశంలోనే తొలి ఎత్తయిన కట్టడమూ ఇదే కావడం గమనార్హం.

ఎల్ఐసి రాకముందర 1918లో మద్రాస్ పబ్లిషింగ్ హౌస్ ఆధీనంలో ఉండిన ఈ స్థలాన్ని 1943లో బొబ్బిలి రాజా కొనుగోలు చేసారు. అయితే ఆయన 1951లో ఈ స్థలాన్ని యునైటెడ్ ఇండియా ఇన్ష్యూరన్స్ కంపెనీకి విక్రయించారు. ఈ బీమా సంస్థ వ్యవస్థాపకుడు చిదంబరం చెట్టియార్. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ వ్యవస్థాపకులుకూడా ఈయనే.

చిదంబరం చెట్టియార్ 1952లో తన యునైటెడ్ ఇండియా లైఫ్ అష్యూరన్స్ అండ్ న్యూ గార్డియన్ లైఫ్ ఇన్ష్యూరన్స్ కి హెడ్ క్వార్టరుగా ఓ పద్దెనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకున్నారు. న్యూయార్కులో ఉన్న ఐక్యరాజ్యసమితి భవనాన్ని తలపించే రీతిలో ఆ భవనం ఉండాలనుకున్నరు. దాని ఫలితమే ఈ ఎల్ఐసి కట్టడం నిర్మితమైంది.

ఈ భవన రూపకల్పన బాధ్యతను లండన్ కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ సంస్థ బ్రౌన్ అండ్
మౌలిన్ కి అప్పగించారు. 1953లో ఈ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే 1957లో ప్రాజెక్టు నుంచి ఈ లండన్ సంస్థ తప్పుకుంది. అప్పుడు స్థానిక ఎల్.ఎం. చితాలే డెవలపర్ కోరమాండల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మురుగప్ప గ్రూప్) మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసింది.
అప్పట్లో దీనికైన ఖర్చు ఎనభై ఏడు లక్షల రూపాయలు.

ఇలా ఉండగా, 1956లో జవహర్ లార్ నెహ్రూ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రైవేట్ భీమా సంస్థలన్నింటినీ జాతీయం చేసింది. ఈ క్రమంలో ఆయా సంస్థల ఆస్తిపాస్తులూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోకెళ్ళాయి.

మరోవైపు 1959 లో ఈ భవన నిర్మాణం పూర్తికావడంతోనే ప్రభుత్వ కట్టడంగా మారిపోయింది. చిదంబరం చెట్టియార్ బీమా సంస్థలన్నీ ప్రభుత్వ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి)లో కలిసిపోయాయి.

1959లో అప్పటి దేశ ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

లక్షా నలభై వేల చదరపు అడుగుల విస్ణీర్ణంలోవేయి టన్నుల ఉక్కు, మూడు వేల టన్నుల సిమెంటుతో ఈ భవన నిర్మాణపనులు కొనసాగాయి. దీని ఎత్తు 177 అడుగులు.

ఈ ఎత్తయిన భవనం మొత్తం విస్తీర్ణం పదమూడు లక్షల ఆరు వేల నూరు చదరపు అడుగులు. అంటే 56.5 గ్రౌండ్లన్న మాట. నేల భాగం మాత్రం పద్నాలుగున్నర గ్రౌండ్లు. ఈ భవనంలో మొత్తం అయిదు లిఫ్టులున్నాయి.

ఈ ఎల్ఐసి కట్టడం దక్షిణ మండల ప్రధాన కేంద్ర కార్యాలయమై విలసిల్లుతోంది. ఈ భవనంలోనే కొంత భాగం మరికొన్ని సంస్థలకు అద్దెకిచ్చారు

తమిళనాడు ప్రజల గుండెల్లో చెరగని స్థానం పొందిన ఈ భవనం వయస్సు అరవై ఏళ్ళు దాటింది.

– యామిజాల జగదీశ్

Also Read : అప్పు తీర్చిన పిన్ను!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్