ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నారు. హెచ్‌ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2023 (Bio Asia) సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు.
హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. గత ఏండేండ్లలోనే 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
నగరంలో 20కిపైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని తెలిపారు. లైఫ్‌సైన్సెస్ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. 2023కుగాను ‘జీనోమ్ వ్యాలీ’ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నామని చెప్పారు.