జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమైతే దానిపై తానెలా స్పందిస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. టిడిపిని బిజెపికి దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్న అంశం తన దృష్టిలో లేదని, సమాచారం లేనప్పుడు ఏమీ మాట్లాడలేనన్నారు.ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ లో బాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గతంలో తిట్టిందీ ఆయనే, ఇప్పుడు పోగుడుతున్నదీ ఆయనేనంటూ బదులిచ్చారు. తామెప్పుడూ ఎవరినీ తిట్టబోమని, అంశాల వారీగా మాత్రమే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బూతుల రాజకీయం జరుగుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట కార్యక్రమం 100 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా పాత మంగళగిరి హరిజనవాడలో ఏర్పాటుచేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి సోము పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడంతో పాటు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని నిర్ణయించామని దీనికోసం రెండు కమిటీలు నియమించామని చెప్పారు. వీటిలో ఒకటి సమాచారం సేకరించేందుకు వేశామని, నిన్న ఈ కమిటీ మీటింగ్ జరిగిందని పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ ఎంపిలు, ఎమ్మెల్యేలు… ల్యాండ్, శాండ్, గ్రావెల్, కోల్, యాష్ లాంటి వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందో బైట పెడతామని చెప్పారు. సమాచారం అంతా సేకరించి ఛార్జ్ షీట్ వేసి, తర్వాత దీనిపై ఏ విధంగా ఉద్యమం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం సుజనా చౌదరి నేతృత్వంలో ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మే నెల 6 నుంచి 13 వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ తొమ్మిదేళ్ళ పాలన పూర్తవుతున్న సందర్భంగా మే 15 నుంచి నెలరోజుల పాటు వివిధ కార్యక్రమమాలు నిర్వహించబోతున్నామని, మొదటి 15 రోజులు కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు వివరిస్తామని, మిగిలిన 15 రోజులు ప్రజా పోరు నిర్వహిస్తామని వివరించారు.