Sunday, January 19, 2025
HomeTrending Newsజంబో బోర్డు సరికాదు: సోము

జంబో బోర్డు సరికాదు: సోము

తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు వెల్లడించారు. టిటిడి మార్గదర్శకాలు,  హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. వీర్రాజు నేతృత్వంలో బిజెపి నేతలు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకున్నారు. టిటిడి పాలక మండలి నియామకంపై  ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి ఈ విషయమై ప్రభుత్వాన్ని పిలిపించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని వీర్రాజు మీడియాకు వెల్లడించారు. సభ్యులు 25 మంది, ప్రత్యేక ఆహ్వానితుల పేరిట యాభై మందిని నియమించడం సరికాదన్నారు. వీరందరూ ప్రతిరోజూ కొండపై దర్శనాలు చేసుకుంటే, అనుచరులకు సిఫార్సు లేఖలు ఇస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతుందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా వెళుతోందని, ఈ వైఖరిపై ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రభుత్వం తీరు మారకపోతే తమ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

టిటిడి సభ్యత్వం కోసం సిఫార్సు చేస్తూ తమ పార్టీ తరఫున జేపీ నడ్డా మాత్రమే  లేఖ ఇస్తారని, మిగతా వారు ఇస్తే ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, టిటిడి మార్గదర్శకాలకు అనుగుణంగానే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సోము స్పష్టం చేశారు.  మొత్తం జంబో బోర్డు మీదే తగు విచారణ జరిపి ప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్ ను కోరామన్నారు వీర్రాజు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్