Thursday, April 25, 2024
HomeTrending Newsమరింత బాధ్యతతో పని చేస్తాం: సిఎం జగన్

మరింత బాధ్యతతో పని చేస్తాం: సిఎం జగన్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి, వీలైనంత ఎక్కువగా ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ ఎన్నికల ప్రకియ విపక్షాల దుర్బుద్ధి, కుట్రల కారణంగా ఇప్పటికి పూర్తయిందని, అప్పుడే పూర్తయి ఉంటే కోవిడ్ సమయంలో ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు మరింత సేవ చేసి ఉండేవారని అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందించారు. నిన్నటి విజయం తమ ప్రభుత్వం మీద, తనమీద మరింత బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు.

ఇవి పార్టీ సింబల్ తో జరిగిన ఎన్నికలని, వీటిలో తాము తిరుగులేని విజయం సాధించామని అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన ఓటమి అంగీకరించలేని స్థితిలో ఉందని జగన్ విమర్శించారు. టిడిపికి మద్దతిస్తున్న కొన్ని మీడియా సంస్థలు కూడా నిన్నటి విజయాన్ని ఒప్పుకోలేని పరిస్థితుల్లోకి దిగజారడం శోచనీయమన్నారు.

2019 సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను 151; 25 పార్లమెంట్ సీట్లకు గాను 22 గెల్చుకున్నామని, 50 శాతం పైచిలుకు ఓట్లతో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 87 శాతం పార్లమెంట్ సీట్లతో తమ ప్రయాణం మొదలైందన్నారు జగన్.

పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 13 081 పంచాయతీలకు గాను 10,536 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారని, 81 శాతం విజయం దక్కించుకున్నామని వివరించారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 75 స్థానాలకు 74 చోట్ల గెలుపొంది 99 శాతం, మున్సిపల్ కార్పొరేషన్లలో 12కి 12 గెల్చుకుని 100 శాతం సాధించామని గుర్తు చేశారు. నిన్న వెలువడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు గాను 8,248 చోట్ల అంటే 86 శాతం; 638 జడ్పీటీసీ స్థానాల్లో 628 అంటే 98 శాతం సీట్లు గెలుపొందామని వెల్లడించారు.

రెండున్నరేళ్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలు నేరవేర్చామని, మిగిలిన వాటిని కూడా అమలు చేసే పనిలో ఉన్నామని తెలియజేశారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో ప్రభుత్వానికి తోడుగా నిలుతున్న ప్రజలకు సదా రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు జగన్. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు విపక్షాలు, మీడియా సంస్థలు అన్యాయంగా అడ్డుపడుతున్నా, దేవుడి తయతో…ప్రజలందరి చల్లని దీవెనలతో ముందుకు సాగుతున్నామని, భవిష్యత్ లో కూడా పజలందరికీ మరింత మేలు చేసేలా తమ పరిపాలన ఉంటుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్