జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే అర్ధం వచ్చేలా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు ఖండించారు. నాని వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహా రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు తీవ్రంగా స్పందించారు.
మీ వ్యవహారం ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక, కేంద్రంపై నిందలుమోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును వైసీపీ కూడా ఫాలో అవుతున్నారంటే వారి ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉందని అర్ధమవుతోందని బదులిచ్చారు.
“మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకు లేదు, ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక… రోజు గడవడానికి అప్పు పుట్టక… రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారంటూ’ సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీసి తనంత తానే అస్థిరత పాలైందని, మేము రాజకీయంగా అస్థిరం చేయాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు కామెంట్ చేశారు. బిజెపి ఓ సామాజిక సేవా దృక్పథం కలిగిన రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు. కాషాయ కండువా, బాబా రాజ్యం అంటూ నాని చేసిన వ్యాఖ్యలను సోము తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన భావన ఉన్న కాషాయంపై ఇలా మాట్లాడడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
బిజెపి ఏమీ స్వచ్చంద సేవా సంస్థ కాదని, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోవాలి, ఎప్పుడు ఓ కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తిని ఇక్కడ సిఎం పీఠంపై కూర్చోబెట్టాలి, బాబా రాజ్యం రావాలని వాళ్ళు కలలు కంటున్నార”ని నిన్న మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.