Never in History: పీఆర్సీ పేరుతో జీతాలు తగ్గించిన చరిత్రలో లేదని, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను రోడ్ల మీదకు తీసుకువచ్చిన సందర్భం కూడా గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ పీఆర్సీతో కొందరు ఉపాధ్యాయులు తిరిగి ప్రభుత్వానికే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని, పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి అధ్వర్యంలో నిరసన దీక్ష విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల వల్లే రివర్స్ పీఆర్సీ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆదాయ వనరులన్నీ అధికారపార్టీ నేతల పరం అవుతున్నాయని, ప్రజలకు మాత్రం అప్పులు మిగులుతున్నాయని సోము విమర్శించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రభుత్వం కాదని, జగన్ ప్రైవేటు కంపెనీ అని మాజీ మంత్రి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ తప్ప రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. జగన్ కంపెనీలు కూడబెట్టిన డబ్బు ఎవరూ సంపాదించలేరని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ జగన్ కంపెనీకి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని, ఇప్పుడు ఉద్యోగస్తులందరినీ సిఎం మోసంచేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిఎం రమేష్, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : చీఫ్ జస్టిస్ ముందుకు పీఆర్సీ పిటిషన్