Saturday, January 18, 2025
HomeTrending Newsఅభద్రతా భావంతో కెసిఆర్ తప్పుడు ప్రచారం - కిషన్ రెడ్డి

అభద్రతా భావంతో కెసిఆర్ తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

కెసిఆర్ తొండి ఆట ఆడుతున్నారని, అభద్రతా భావంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. IAS, IPS అధికారులు కూడా తెలంగాణలో బిజేపీ రావాలని ఆశిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్‌లో జరుగుతోన్నాయి. ఆదివారం ఈ శిక్షణా తరగతులు ప్రారంభమవ్వగా.. మంగళవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. పార్టీ సిద్దాంతాలతో పాటు పార్టీ సంస్థగత నిర్మాణం, ఇతర అంశాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణాతరగతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లోని కొంతమంది నేతలు, కార్యకర్తలతో పాటు బ్యూరోక్రాట్స్ కూడా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీని విమర్శించి సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో మార్పు కనిపిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేవలం అభద్రతా భావంతోనే బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. కేసీఆర్ దళితబంధు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నవారికి మాత్రమే ఇస్తున్నారని, అర్హులైన వారికి పథకాలు అందించాలని సూచించారు.

ప్రధాని మోదీని విమర్శిస్తే తన స్థాయి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఫైల్స్‌కి తాము భయపడేది లేదని, బీజేపీ బెదిరిపోయే పార్టీ కాదన్నారు. బీజేపీలో కుటుంబ పాలన ఉండదన్నారు. బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో.. ఎవరు పార్టీ అధ్యక్షుడవుతారో చెప్పలేమని కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పార్టీలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో.. ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో ముందే తెలిసిపోతుందన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బులు బాగా ఉండాలని నేతలు భావించవద్దని, ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉండాలని నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. ఏ పార్టీలో అయినా భేదాభిప్రాయాలు సాధారణం అని, వాటిని పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలని ఆయన తెలిపారు. బీజేపీని తిట్టి ఓట్లు సంపాదించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాలను తిప్పి కొట్టాలని సూచించారు. సీబీఐకి భయపడి రాష్ట్రంలో అనుమతి నిరాకరిస్తూ జీవో తెచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాగా ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై కూడా చర్చించనున్నారు. తరగతుల చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్