బోనాల పండుగకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని,ఇందులో భాగంగా జంట నగరాల్లో బోనాల ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 3,500 కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఈ నెల 17 న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. 24న హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18 వ తేదీన చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.