Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రూల్ అఫ్ లా ఉందా? బొండా

రూల్ అఫ్ లా ఉందా? బొండా

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మందు తాగి చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు.  మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి తెగపడుతుంటే  అడ్డుకోవాల్సిన పోలీసులు సెల్యూట్ కొట్టి మరీ దాడికి అనుమతించారని అయన విమర్శించారు. నిన్న జరిగిన ఘటనతో మనం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అంటూ స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు జాతి మొత్తం నివ్వేరపోయిందని అన్నారు.  రాష్ట్రంలో రూల్ అఫ్ లా, రాజ్యాంగం అమలవుతోందా అని బొండా ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కాకుండా దాడికి గురైన వారిపై ఎలా కేసులు పెట్టాలా అని పోలీసు అధికారులు సమాలోచనలు చేయడం దారుణమన్నారు.

చంద్రబాబు హయాంలో ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని, అలాంటి శాఖలో ఉన్నతాధికారులు ఇప్పుడు పదవుల కోసం, ప్రమోషన్ల కోసం దిగజారి పని చేస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న తమకు సరైన సమయంలో సమాచారం రాలేదని, అందుకే అక్కడకు రాలేకపోయామని,  మేము వచ్చి ఉంటే జోగి రమేష్ ను అక్కడే తాగింది దిగే వరకూ కొట్టి ఉండేవాళ్లమని అన్నారు ఉమా.

జోగి రమేష్ ప్రతిరోజూ వందలాది లారీల అక్రమ ఇసుకను అమ్ముకుంటున్నారని, తన అక్రమ దందా కొనసాగించడానికి, సిఎం జగన్ ను ప్రసన్నం చేసుకొని మంత్రి పదవి సంపాదించడం కోసమే జోగి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, అది నశించిన రోజు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని బొండా ఉమా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్