టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత పట్టాభి సిఎం జగన్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మావోయిస్టులు ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని నిషేధం విధించామో అలాగే తెలుగుదేశం పార్టీపై కూడా నిషేధం విధించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. 356 అధికరణం ఎందుకు పెట్టకూడదంటూ చంద్రబాబు మాట్లాడడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. సిఎంను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని చంద్రబాబు సమర్ధించడం దారుణమని, జగన్ మోహన్ రెడ్డిపై ఉపయోగించిన ఇలాంటి భాషను సమర్దిస్తామా అంటూ ప్రశించారు. ఇలాంటి నీచమైన, నికృష్టమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు మొదటినుంచీ అలవాటేనని బొత్స అన్నారు. ఆయనది ఎప్పటికీ క్రిమినల్ ఆలోచనేనని, అయన రాజకీయ జీవితంలో ఏనాడూ స్వచ్చందంగా, నేరుగా ప్రజల అభిప్రాయం పొందడానికి ముందుకు రాలేదని మండిపడ్డారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వత్తాసు పలకడం హేయమని బొత్స వ్యాఖ్యానించారు. ఇది హేయమైన భాష అని నీకు తెలియదా అంటూ పవన్ ను సూటిగా ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు కలిసి ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, తద్వారా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని బొత్స అన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి తుచ్చమైన, నీచమైన రాజకీయాలకు పాల్పడతారని తాము ఎన్నడూ అనుకోలేదన్నారు. దాడిని ఖండించిన సోము వీర్రాజు, టిడిపి నేతలు సిఎంపై ఉపయోగించిన భాషను సమర్ధిస్తారా అని బొత్స అడిగారు. జాతీయ పార్టీగా ఇలాంటి నీచమైన భాషను ఖండించాల్సిన అవసరం ఉందని వీర్రాజుకు హితవు పలికారు.