Monday, May 20, 2024
HomeTrending Newsవైషమ్యాలకు విపక్షం యత్నం: సిఎం జగన్

వైషమ్యాలకు విపక్షం యత్నం: సిఎం జగన్

ఉద్దేశ పూర్వకంగా తనని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రతిపక్షంలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఆడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ, వంచన, మోసం, వక్రబుద్ధితో వ్యవహరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా వెనుకాడడం లేదని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సిఎం అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు లబ్ధి దారులకు వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేసే కార్యక్రమానికి సిఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై స్పందించారు.

అంతా నా వాళ్ళే,  అన్ని ప్రాంతాలూ నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అన్న భావనతోనే  ఈ రెండున్నరేళ్ళ పరిపాలన సాగుతూ వచ్చిందన్నారు జగన్.  దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ముందుకు సాగుతున్న ఈ పరిపాలన అందరికీ నచ్చించి కాబట్టే పంచాయతీ, పురపాలక, తిరుపతి ఉప ఎన్నిక, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు స్థానం లేకుండా అందరూ సొంత బిడ్డలా, అన్నలా, తమ్ముడిలా నన్ను భావించి ఆశీర్వదించారని జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చూపుతున్న ఆదరణ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్షం, ఒక సెక్షన్ అఫ్ మీడియా ఏ విధంగా తయారయ్యారో చూస్తూనే ఉన్నారని, ఎవరూ మాట్లాడలేని, అన్యాయమైన మాటలు మాట్లాడుతూ, బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి భాష ఎన్నడూ ఉపయోగించలేదని గుర్తు చేశారు.  తనపై అభిమానం, ప్రేమ ఉన్నవారు, ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక రియాక్షన్ రాష్ట్రవ్యాప్తంగా కనిపించిందని అయన వ్యాఖ్యానించారు.

పేదవాడికి ఏ మంచి జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి ప్రతిపక్షం వెళ్లిందని ఆరోపించారు. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఆ మంచిని ఆపడానికి రకరకాల కోర్టు కేసులు వేయిస్తున్నారని, ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితుల మధ్య కూడా రెండున్నరేళ్లుగా మనస్పూర్తిగా ఆత్మ సంతృప్తి కలిగేలా పరిపాలన చేయగలిగానని సిఎం జగన్ భావోద్వేగంతో చెప్పారు. ఇక ముందు కూడా పేదవాడికి మంచి చేసే విషయంలో ఎలాంటి వెనకడుగు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్