జనసేన ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, సిద్దాంతాలు ఆ పార్టీకి లేవని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి మీకు అవసరం లేదా అని పవన్ ను ప్రశ్నించారు. విశాఖలో మంత్రి అమర్నాథ్, పార్టీ నేతలతో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన కలిసి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని సంపద మొత్తం 29 గ్రామాల్లోనే పోయాలా అని నిలదీశారు.
విశాఖకు వ్యతిరేకంగా జరిగే ఆటలు ఇకపై సాగబోవని బొత్స స్పష్టం చేశారు. విశాఖ రాజధానిపై ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆ రెండు పార్టీలూ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తరంధ్రపై ద్వేషం తగదని హెచ్చరించారు.
నిన్నటి విశాఖ గర్జనను, ఉత్తరాంధ్ర ఆకాంక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బొత్స కృతజ్ఞతలు తెలియజేశారు. జోరు వానలోనూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ ఆకాంక్షను వెలిబుచ్చారని బొత్స అన్నారు. ఇక్కడ రాజధాని వద్దంటూ కొందరు మాయమాటలు మాట్లాడుతున్నారని, వారికి నిన్నటి గర్జన ఒక కనువిప్పులాంటిదని అన్నారు.
Also Read: మాకు మరో ప్రతిపక్ష పార్టీ అంతే: బొత్స