Saturday, January 18, 2025
Homeసినిమాభ్రమయుగంలో వాన 

భ్రమయుగంలో వాన 

అతిశయోక్తులు అవసరం లేని అద్భుతం. ఓ మమ్ముట్టీ, ఓ బ్లాక్ అండ్ వైట్, ఓ హారర్… వెరసి భ్రమయుగం. బ్లాక్ అండ్ వైట్ హారర్. భయంకర శబ్దాలూ, మీద పడే దెయ్యాలూ లేని హారర్. ఇది మానసికం. ఇది నలుపు తెలుపుల వర్ణ చిత్రం. ఏ భ్రమలూ పెట్టుకోకండి. సింపుల్ గా మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాకింగ్.

మూడే పాత్రలు. మూడు నట విశ్వరూపాలు. అందులో మముట్టీది మహా విశ్వరూపం. లోతు తెలీని కడలి. కొలవలేని శిఖరం. ఇక సిద్ధార్ధ్ భరతన్, అర్జున్ అశోకన్ మముట్టీని ఢీ కొట్టి మనల్ని కట్టి పడేస్తారు. అలా చూస్తూ ఉండి పోతాం. కొడుమన్ పొట్టి లోని చాతాన్  చెప్పినట్లు ఘడియలా.. రోజులా.. నెలలా.. సంవత్సరాలా..వర్షం కురుస్తూనే ఉంటుంది. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం మరచి భ్రమయుగంలో చిక్కి కాలం మరచిపోతాం. భ్రమయుగంలో అంతర్లీనంగా నడిచే అంశం కూడా అదే… కాలాన్నీ, తమనీ మరచి పోవడం. నో మెలోడ్రామా, నో పిచ్చి పంచ్ డైలాగ్స్. నిజమని భ్రమింపచేసే పాత్రలే… పొల్లు పోకుండా కథని పట్టి నడిపించే డైలాగ్సే. బోథ్ అర్ నాట్ సేమ్.

భ్రమ యుగం హారర్ మాత్రమే కాదు. అంతకు మించి. 17వ శతాబ్ది నాటి దక్షిణ మలబార్ సామాజిక రాజకీయ పరిస్థితులకి దర్పణం. అయితే ఇది అంతర్లీనం. గమనిస్తేగాని తీగ దొరకదు. సింబాలిజానికి పరాకాష్ట…భ్రమయుగం. ఈ కథలో అధికారం నిర్మించే సామ్రాజ్య వలయానికి, నిర్మించుకున్న వాళ్ళు అధిపతులే కాదు ఆ వలయం లో చిక్కుకున్న వాళ్ళు కూడా. వాళ్ళు తోచక ఇతరుల స్వేఛ్చ తో ఆడే ఆటలోకి తెలీకుండా… పిలవకుండా బానిసలు వచ్చి చిక్కుకు పోతారు, బలై పోతారు.  భ్రమ యుగం లో  భగవంతుడిని ప్రార్ధించి ప్రయోజనం లేదు. విధి మాత్రమే వైపరీత్యం, బలీయం. విధి నీకు ఒక్కసారే అవకాశం ఇస్తుంది. ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇదంతా తెలుసుకుని భ్రమల్లోంచి బయట పడేలోపు అధికారం రూపు మార్చుకుంటుంది తప్ప ఆధిపత్యాన్ని కోల్పోదు. చాతాన్ అన్నట్లు అంతా అనుకున్నట్లే జరుగుతుంది. పాత్రల పేర్లను బట్టి సామాజిక పరిస్థితులని అర్ధం చేసుకోవచ్చు. ఈ సన్నని తీగని పట్టుకుని పరికిస్తే, సినిమా ఇట్టే విడి పోతుంది. లేకుంటే అది కేవలం ఓ హారర్ గా మిగిలి పోతుంది. ఇక ప్రతీ సన్నివేశమూ సింబాలిక్ గా ఉంటుంది. వాన, యక్షిణి, చాతాన్, సింహద్వారం అన్నీ సింబల్సే. ప్రతి చిన్న విషయమూ కథా గమనానికి అవసరమైనవే. వాటిని పట్టుకుని భ్రమయుగం నుండి బయట పడవచ్చు. లేకుంటే భ్రమలో కూరుకు పోతాం.

పణ్ణన్ పాత్ర (పణ్ణన్ అనేది ఆనాటి సమాజం లో పాటలు పాడే అట్టడుగు వర్గానికి చెందిన ఓ కులం) లో అమాయకత్వం, మానవ ప్రయత్నం కనిపిస్తే,  వంటవాని లో నిర్లిప్తతా, కనీ కనబడని  పొగరు, నిబ్బరం లాంటి లక్షణాలు కథాగమనంలో అతనెవరో తెలిశాక వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రస్ఫుటం అవుతాయి. చాతాన్ పూనిన కొడుమన్ పొట్టి లో పరస్పర విరుద్ధ లక్షణాలు చూస్తాం. ఓ వైపు కొడుమన్ పొట్టి పాండిత్యం, మర్యాద, కనిపిస్తే మరుక్షణం చాతాన్ లోని క్షుద్రతా, వంచన, అధికార వాంఛ కనిపిస్తాయి. ఇన్ని లక్షణాలను అలవోకగా సునాయాసంగా పలికిస్తాడు మమ్ముట్టి. పొట్టి అనే పేరు మలబార్ ప్రాంతానికి వలస వెళ్లిన తుళు బ్రాహ్మణ కుటుంబాల పేరు. ఈ సినిమాలో కొడుమన్ పొట్టి పాత్ర ద్వారా తమ ప్రతిష్టకి భంగం కలిగించేట్లు చిత్రీకరించారని ఓ కోర్ట్ కేస్ కూడా ఫైల్ అయ్యింది.

చివరి ఘట్టం ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ముగుస్తుంది. నదిని దాటలేని పణ్ణన్ మరలా అదే నది ఒడ్డున రూపు మార్చుకుని నిలబడతాడు. అధికారానికి సింబల్ గా చూపించిన ఆ ఉంగరం ధరించి. అధికారం రూపు మార్చుకుంటుంది కానీ ఆధిపత్యం కోల్పోదు. వంటవాడు చనిపోవడం కూడా నా దృష్టిలో ఓ సింబాలిజం. ఇక రూపు మార్చుకున్న అధికారం కొత్తగా అధికారం కోసం వేట ప్రారంభించిన పోర్చుగీసు/ బ్రిటిష్ వారితో తలపడనుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

అయితే, దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ సినిమాని ఓ హారర్ సినిమాగానే మొదలు పెట్టాననీ, సామాజిక రాజకీయ అంశాలు తరువాత జత అయ్యాయని చెప్పాడు ఓ ఇంటర్వ్యూ లో. అయినా, సినిమా తీసి వదిలిన తరువాత వ్యాఖ్యానం మన ఇష్టం. అందులో సింబాలిజం ఉందని అనుకోవడమూ మన ఇష్టమే… మన భ్రమలు మనవి. అధికారానికి అంతం లేదు. భ్రమ యుగానికి అంతం లేదు. వాన కురవడం ఆగదు.

-విప్పగుంట రామ మనోహర

RELATED ARTICLES

Most Popular

న్యూస్