Saturday, November 23, 2024
HomeTrending Newsబ్రెజిల్‌ లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌ లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, కాంగ్రెస్‌ భవనాలలోకి చొరబడ్డారు. సెక్యూరిటీ వలయాలను ఛేదించి, బారికేడ్లను తొలగించిన ఆందోళనకారులు పెద్దయెత్తున ఈ భవనాల్లోకి ప్రవేశించారు. భవనాల పైకప్పుల పైకి సైతం ఎక్కిన ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. కిటికీలు, తలుపులతో పాటు లోపల ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. అధ్యక్షుడిగా లూయిజ్‌ ఇనాసియో లులా డసిల్వా ప్రమాణస్వీకారం చేసిన వారం తర్వాత ఈ విధ్వంసకర సంఘటన చోటుచేసుకుంది.

గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే తన ఓటమిని ఆయన ఒప్పుకోక ఎన్నికల విధానాన్ని, సుప్రీంకోర్టును విమర్శిస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన మద్దతుదారులు రోడ్లను దిగ్బంధించడం, వాహనాల దహనం, మిలటరీ కార్యాలయాల ముందు పెద్దయెత్తున గుమిగూడటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వేలమందితో బ్రెజిల్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు.

మిలటరీ వెంటనే జోక్యం చేసుకుని మాజీ అధ్యక్షుడు బోల్సొనారోని తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం గాని లేదా ప్రస్తుత అధ్యక్షుడు లులాను పదవి నుంచి దించివేయడం కాని చేయాలని పలువురు ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను అణచివేయడానికి పోలీసులు పెద్దయెత్తన టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. సాయంత్రానికి ఆందోళనకారుల ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకున్నామని, 200 మందిని అరెస్ట్‌ చేశామని బ్రెజిల్‌ న్యాయ శాఖ మంత్రి ఫ్లావియో డినో మీడియా సమావేశంలో వెల్లడించారు

మరోవైపు బ్రెజిల్ మాజీ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో ఆస్ప‌త్రి పాల‌య్యారు. క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న జైర్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు ఆయ‌న భార్య మిచ్చెల్లె బోల్సోనారో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జైర్ ఫ్లోరిడాలోని అడ్వెంట్ హెల్త్ సెల‌బ్రేష‌న్ అక్యూట్ కేర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు బ్రెజిల్ న్యూస్ పేప‌ర్ ఓ గ్లోబో తెలిపింది. అయితే జైర్‌పై 2018లో జ‌రిగిన క‌త్తి దాడి వ‌ల్ల మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు ఆయ‌న భార్య పేర్కొంది. ప్రస్తుతం జైర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. బ్రెజిల్ అధ్య‌క్షుడిగా త‌న ప‌ద‌వీకాలం ముగిసే కంటే రెండు రోజుల ముందు(డిసెంబ‌ర్ 31) జైర్ అమెరికాకు వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్