Wednesday, July 3, 2024
HomeTrending Newsకుప్పకూలుతున్న వంతెనలకు కేరాఫ్ బీహార్

కుప్పకూలుతున్న వంతెనలకు కేరాఫ్ బీహార్

బీహార్‌ రాష్ట్రంలో వరుసగా కూలుతున్న వంతెనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆరు నెలల్లోనే వరుసగా వంతెనలు కుప్పకూలటంతో బిహార్ రాష్ట్రం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఇప్పటికే మూడు బ్రిడ్జిలు కుప్పకూలగా.. తాజాగా మరో వంతెన కూలిపోయింది. నేపాల్ సరిహద్దుల్లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో కంకై నదికి చెందిన ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల పొడవైన వంతెన కూలిపోయింది. ఈ వంతెన బహదూర్‌గంజ్‌ – దిఘల్‌బ్యాంక్‌ బ్లాక్‌లను కలుపుతుంది. ఈ వంతెన కూలిపోవడంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కంకై నదిలో నీటిమట్టం పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఉద్ధృతి కారణంగా వంతెన మధ్యలో ఉన్న పలు స్తంభాలు సుమారు ఒకటిన్నర అడుగుల మేర మునిగిపోయాయి. వారం వ్యవధిలోనే బీహార్‌ రాష్ట్రంలో వంతెనలు కూలిపోవడం వరుసగా ఇది నాలుగో ఘటన.

అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో గత మంగళవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ.12 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఈ వంతెనపై ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వకపోవటంతో ప్రమాదం తప్పింది. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఆ తర్వాత శనివారం ఉదయం సివాన్‌ జిల్లాలో చిన్న వంతెన కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్‌ బ్లాక్స్‌లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్‌పై కట్టిన ఈ బ్రిడ్జ్‌..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్‌లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్‌ ముకుల్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఆ తర్వాత రోజు ఆదివారం తూర్పు చంపారన్‌లో నిర్మాణంలో ఉన్న 16 మీటర్ల వంతెన కుప్పకూలింది. మోతిహారి బ్లాక్‌లో ఘోరసహాన్‌లో జరిగిన ఘటనలో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. ఆమ్వా అనే గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతూ కెనాల్‌పై బ్రిడ్జ్‌ను రూరల్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నది. మోతీహరిలో రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఇది ఆదివారం రాత్రి 12 గంటలకు ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోక… కాస్టింగ్‌ కోసం ఏర్పాటుచేసిన సెంట్రింగ్‌ పైపు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు.

వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వాడిన నాసిరకం సామాగ్రి, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస ప్రమాదాలతో అధికారులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా..? లేక ఎవరైనా కావాలనే కూల్చి వేస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్